KTR: తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. ముఖ్యంగా మూసి నది ప్రక్షాళన, పేదల ఇళ్ల కూల్చివేత అంశాలపై ఆయన ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఒక భారీ సవాల్ విసిరారు.
అభివృద్ధి అంటే కూల్చివేతలు కాదు
మూసి నదిని అందంగా తీర్చిదిద్దడానికి తాము వ్యతిరేకం కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. అయితే, ఆ పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయడాన్ని తాము అడ్డుకుంటామని హెచ్చరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మూసి శుద్ధి కోసం 32 సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని ఆయన గుర్తు చేశారు. మూసిలోకి వచ్చే మురికి నీటిని శుద్ధి చేసి, ఆ నీటిని నిర్మాణ రంగానికి వాడుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశామని, రెండో దశలో కాలేశ్వరం నీటిని మూసిలోకి మళ్లించాలని అనుకున్నామని కేటీఆర్ వివరించారు.
ఇళ్ల నిర్మాణంపై బహిరంగ సవాల్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా, హైదరాబాద్లో పేదల కోసం ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని కేటీఆర్ ఆరోపించారు. “నగరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇల్లు అయినా కట్టినట్లు నిరూపిస్తే.. నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా” అంటూ ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు. మూసి సుందరీకరణ పేరుతో అవినీతికి పాల్పడితే ఊరుకోబోమని, బడ్జెట్ సమావేశాల్లో పేదల గొంతుకగా నిలబడి ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ప్రజల ఆగ్రహం తప్పదు
ప్రస్తుత ప్రభుత్వం పాలన చేయడంలో విఫలమైందని, ప్రజలు కాంగ్రెస్ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మంచి పాలన ఎలా ఉండాలో తాము చేసి చూపిస్తామని, ప్రభుత్వం సరిగ్గా పనిచేయలేకపోతే పక్కకు తప్పుకోవాలని ఆయన సూచించారు. రాబోయే రోజుల్లో పేద ప్రజలే ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని కేటీఆర్ హెచ్చరించారు.
