KTR: పద్మశ్రీ అవార్డు గ్రహీత, కిన్నెర మొగులయ్యకు ఎదురవుతున్న కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. ఆయనకు ఇంటి స్థలం సమస్యతో పాటు కంటి చికిత్స బాధ్యతను కూడా స్వయంగా తీసుకుంటానని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) భరోసా ఇచ్చారు.
శనివారం రోజున హైదరాబాద్‌లో మొగులయ్య, కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి, ఎలా ఉన్నారనే విషయాలను కేటీఆర్ ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు.
ఇంటి స్థలం సమస్యపై వివరణ
హయత్‌నగర్ మండలంలో గతంలో ప్రభుత్వం తనకు ఇచ్చిన 600 గజాల స్థలం విషయంలో కొందరు వ్యక్తుల నుంచి ఎదురవుతున్న ఇబ్బందులు, కోర్టు కేసుల వివరాలను మొగులయ్య కేటీఆర్‌కు వివరించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి సహాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కలెక్టర్‌తో మాట్లాడిన కేటీఆర్
మొగులయ్య విజ్ఞప్తికి వెంటనే స్పందించిన కేటీఆర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. మొగులయ్యకు ఎదురవుతున్న న్యాయపరమైన సమస్యలు త్వరగా పరిష్కరించడంలో పూర్తి సహాయం అందిస్తామని కలెక్టర్‌కు కేటీఆర్ సూచించారు. మొగులయ్యకు పూర్తి భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, “కిన్నెర మొగులయ్య మన రాష్ట్ర సంస్కృతికి, కళకు అద్దం పట్టే గొప్ప కళాకారుడు. ఆయనకు ఎలాంటి కష్టం వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుంది,” అని చెప్పారు. మొగులయ్యకు అన్ని విధాలా సహాయం చేసి, ఆయనకు ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని కేటీఆర్ హామీ ఇవ్వడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు.