KTR: తమ డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు (జనవరి 3) అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన ఆటో డ్రైవర్లను రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల పోలీసులు అరెస్టు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆటో డ్రైవర్ల సంఘాల జేఏసీ పిలుపు మేరకు ఈ ఆందోళనకు దిగారు. ఈ మేరకు ఆటో డ్రైవర్లను అరెస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్రంగా ఖండించారు.
KTR: తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ అంశాన్ని సమావేశాల సందర్భంగా అసెంబ్లీ దృష్టికి తెచ్చేందుకు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన ఆటో డ్రైవర్ల జేఏసీ నేతలను, వేలాది మంది ఆటో డ్రైవర్లను రాష్ట్రవ్యాప్తంగా అరెస్టు చేశారని ఈ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలపై తీవ్రంగా మండిపడ్డారు.
KTR: ఒకరోజు ముందు నుంచే అంటే జనవరి 2 నుంచే ఆటో డ్రైవర్లను, ఆటో యూనియన్ నాయకులను కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టులు చేయిస్తున్నదని కేటీఆర్ ఆరోపించారు. వేలాది మంది ఆటో డ్రైవర్లను రాష్ట్రవ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లలో నిర్బంధంలో ఉంచారని తెలిపారు. వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అరెస్టు చేయడమేమిటని ప్రశ్నించారు.
KTR: ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలపై స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని, ఆటో అన్నలు కోరినట్టుగా ఇదే రోజు (జనవరి 3) అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటనను జారీ చేయాలని కేటీఆర్ కోరారు. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు నివారించాలన్నా, వారి ఉపాధికి ఆసరా ఇవ్వాలన్నా.. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
