KTR: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ఇప్పుడు వేగవంతమైంది. ఈ కేసులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం విచారణకు హాజరయ్యారు. అంతకుముందు రోజు (గురువారం) సిట్ అధికారులు ఆయనకు నోటీసులు పంపడంతో, నేడు జూబ్లీహిల్స్‌లోని ఏసీపీ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. ఇటీవల ఇదే కేసులో మాజీ మంత్రి హరీశ్‌రావును కూడా అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కేటీఆర్‌ను విచారిస్తుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
అసలు ఈ గొడవ ఏమిటంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్ఐబీ (SIB) కేంద్రంగా అక్రమంగా ఫోన్ ట్యాపింగ్‌లు జరిగాయనేది ప్రధాన ఆరోపణ. దీనిపై 2024 మార్చిలోనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆధ్వర్యంలోని సిట్ (SIT) బృందం ఈ కేసును లోతుగా విచారిస్తోంది. ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి? ఇందులో ఎవరి ప్రమేయం ఉందనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
వాస్తవానికి ఈ కేసు నమోదై దాదాపు రెండేళ్లు కావస్తున్నా, విచారణ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించే క్రమంలోనే ప్రముఖ రాజకీయ నేతలను సిట్ అధికారులు విచారిస్తున్నారు. కేటీఆర్‌ను విచారించడం ద్వారా ఈ కేసులో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
