KTR: జనాభా ప్రాతిపదికన పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) జరిగితే, తమిళనాడులో 8 లోక్ సభ సీట్లు తగ్గే ప్రమాదం ఉందని, దీన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రకటించారు. ఇది కేవలం తమిళనాడుకు మాత్రమే కాకుండా మొత్తం దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలిగించే అంశమని ఆయన హెచ్చరించారు.
డీలిమిటేషన్ కారణంగా దక్షిణ భారతదేశంలోని లోక్ సభ సీట్లు 100 వరకూ తగ్గే అవకాశం ఉందని స్టాలిన్ వివరించారు. జనాభా నియంత్రణను సమర్థంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు, ఇప్పుడు ఇందుకు గాను నష్టపోవాల్సిన పరిస్థితి తలెత్తడం అన్యాయమని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దుష్పరిణామాలకు చోటివ్వకూడదని, పునర్విభజన ప్రక్రియ న్యాయబద్ధంగా, పారదర్శకంగా, సమభావంతో ఉండాలని స్టాలిన్ స్పష్టం చేశారు.
ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. డీలిమిటేషన్ విషయంలో స్టాలిన్‌కు పూర్తి మద్దతు ఇస్తున్నానని, ఆయన అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవిస్తున్నానని చెప్పారు. జనాభా నియంత్రణను సమర్థంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలను ఇప్పుడు తీవ్రంగా నష్టపోయేలా చేయడం తగదని ఆయన అన్నారు.
దేశాభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నప్పటికీ, ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన పేరుతో వాటి ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నం ప్రజాస్వామ్య వ్యతిరేకమని, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని కేటీఆర్ విమర్శించారు. కేంద్రం డీలిమిటేషన్‌ను అమలు చేయాలని భావిస్తే, అది జనాభా ప్రాతిపదికన కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థకు రాష్ట్రాలు అందిస్తున్న ఆదాయాన్ని ఆధారంగా చేసుకుని చేయాలని డిమాండ్ చేశారు.
భారతదేశ జనాభాలో తెలంగాణ వాటా 2.8% మాత్రమే అయినా, దేశ జీడీపీలో తెలంగాణ 5.2% కంటే ఎక్కువ భాగాన్ని అందిస్తోందని, ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాల పాత్రను ఎవరూ విస్మరించరాదని కేటీఆర్ స్పష్టంచేశారు.