Ktr: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “వారికి నిజంగా ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ఉపఎన్నికల్లో గెలవాలి” అని ఆయన సవాల్ విసిరారు.
ఆదివారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 20 నెలల్లో ప్రజలకు ఏం చేశారో చెప్పుకొని ఉపఎన్నికలకు రావాలి. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందాం” అని పేర్కొన్నారు.
కేటీఆర్ వ్యాఖ్యల్లో ముఖ్యాంశాలు:
సుప్రీంకోర్టు తీర్పుతో కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలలో ఓటమి భయం మొదలైందని విమర్శించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల బ్లాక్‌మెయిల్ దందాల వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిందని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం 20 నెలల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిన కంటే ఎక్కువ అప్పులు చేసిందని విమర్శించారు.
కేసీఆర్ నాయకత్వంలో విద్యుత్ సమస్యలను పరిష్కరించామని, మతసామరస్యాన్ని కాపాడామని గుర్తుచేశారు.
కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు ప్రజల కోసం కాదు, స్వార్థ ప్రయోజనాల కోసం వెళ్లారని ఆరోపించారు.
“రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ సత్తా ఏంటో చూపిస్తాం” అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.