KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫార్ములా ఈ రేసింగ్ కేసులో తనకు మళ్లీ నోటీసులు పంపించే అవకాశముందని జోస్యం చెప్పారు. ఈ నెల 16న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడితే, 17న తనకు నోటీసులు ఇచ్చే యోచనలో ఉన్నారని అన్నారు. విచారణకు పిలిచి నాటకాలు ఆడతారని, ఫార్ములా ఈ రేసింగ్ కేసు అసలు లొట్టపీసు కేసు మాత్రమేనని వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్సీ నామినేషన్ వేస్తున్న దాసోజు శ్రవణ్
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థి దాసోజు శ్రవణ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ, ఫార్ములా ఈ రేసింగ్ పోటీలకు ₹45 కోట్లు ఖర్చు చేస్తే తప్పని చెప్పినవారు, అందాల పోటీల కోసం ₹200 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు.
మిస్ వరల్డ్ పోటీలపై కేటీఆర్ స్పందన
మిస్ వరల్డ్ పోటీల ద్వారా రాష్ట్రానికి లాభమేమిటని కేటీఆర్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒలింపిక్స్ నిర్వహిస్తామని చెబుతున్నారని, అలాంటప్పుడు దాని కోసం ₹1 లక్ష కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు.
తెలంగాణలో త్వరలో ఉప ఎన్నికలు
తెలంగాణలో త్వరలో ఉప ఎన్నికలు జరగబోతున్నాయని కేటీఆర్ అన్నారు. ఉప ఎన్నికల నేపథ్యంలోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉన్నట్లు చెప్పారు. తమ ఉన్న బలంతోనే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్నామని స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి రేవంత్ రెడ్డి పదేపదే అబద్ధాలు చెబుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. బడ్జెట్ సమావేశాలు అబద్ధాలు, బుకాయింపులతో నడుస్తున్నాయనివిమర్శించారు.