KTR: కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు దెబ్బతిన్నప్పుడు “కూలేశ్వరం” అంటూ విమర్శలు గుప్పించిన కాంగ్రెస్, బీజేపీ నేతలు, ఇప్పుడు రెండోసారి పోలవరం ప్రాజెక్టులో కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయిన విషయంపై “కూలవరం” అని విమర్శించే ధైర్యం ఉందా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు.
కేంద్ర ప్రభుత్వం, జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ (ఎన్డీఎస్ఏ) పక్షపాత ధోరణి స్పష్టంగా బయటపడుతోందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఎన్నికల సమయంలో మేడిగడ్డ వద్ద చిన్న సమస్య తలెత్తగానే 24 గంటల్లోపే ఎన్డీఎస్ఏను రంగంలోకి దించారని, కానీ సాక్షాత్తూ కేంద్రం నిర్మిస్తున్న జాతీయ ప్రాజెక్ట్ పోలవరంలో రెండోసారి కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్‌లో 10 అడుగుల వెడల్పు, 8 అడుగుల లోతులో కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయినా, అక్కడ యుద్ధప్రాతిపదికన గుట్టుచప్పుడు కాకుండా మరమ్మతులు జరుగుతున్నాయని, కానీ తెలంగాణలో 20 నెలలు గడుస్తున్నా మేడిగడ్డ వద్ద కనీస మరమ్మతులు కూడా చేపట్టలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి మూర్ఖత్వమే కారణమని ఆయన దుయ్యబట్టారు.
కేటీఆర్ గుర్తుచేస్తూ – “2020లో పోలవరం డయాఫ్రం వాల్ కొట్టుకుపోయినా, తెలంగాణలో ఎస్ఎల్‌బీసీ టన్నెల్ కూలి 8 మంది రైతులు ప్రాణాలు కోల్పోయినా ఎన్డీఎస్ఏ స్పందించలేదు” అన్నారు. ఇది కేవలం ప్రాజెక్టుల సమస్య కాదని, తెలంగాణ రైతాంగ జీవనాధారం అయిన కాళేశ్వరంపై కాంగ్రెస్, బీజేపీ కలసి చేస్తున్న రాజకీయ కుట్ర అని ఆరోపించారు.
“తెలంగాణ వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టును కంటికి రెప్పలా కాపాడుకుంటాం” అని కేటీఆర్ హామీ ఇచ్చారు.