Kotappakonda: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కోటప్పకొండ–కొత్తపాలెం గ్రామాల మధ్య నిర్మించిన నూతన రహదారిని గురువారం ప్రజలకు అంకితం చేశారు. పంచాయతీరాజ్ నిధుల నుంచి రూ.3.9 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ రోడ్డును మహాశివరాత్రికి ముందే పూర్తి చేస్తామని ఇచ్చిన హామీని ఆయన నిలబెట్టుకున్నారని అధికారులు తెలిపారు. 8 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి కోటప్పకొండ క్షేత్రానికి వచ్చే భక్తులకు ప్రధాన సౌకర్యంగా మారనుంది.
ఈ రహదారి ప్రారంభంతో మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా తరలివచ్చే సుమారు లక్షన్నర మంది భక్తులకు ప్రయాణ కష్టాలు తగ్గనున్నాయి. అంతేకాకుండా, కొత్తపాలెం గ్రామ పరిసరాల్లోని రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌కు తరలించడానికి సులభతరం అవుతుంది. గోనేపూడి జిల్లా పరిషత్ పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు కూడా ఈ రోడ్డు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు తెలిపారు.
రోడ్డు ప్రారంభోత్సవం అనంతరం పవన్ కల్యాణ్ క్షేత్రంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రోడ్డుపై కొంత దూరం నడిచి నిర్మాణ నాణ్యతను స్వయంగా పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు ఈ రోడ్డు అవసరాన్ని అసెంబ్లీ సమావేశాల్లో పవన్ దృష్టికి తీసుకురాగా, భక్తుల ఇబ్బందులు తొలగించేందుకు శివరాత్రి నాటికి రోడ్డును పూర్తి చేస్తామని పవన్ హామీ ఇచ్చిన విషయం గుర్తుచేశారు.
ఈ పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ కోటప్పకొండలో చేపట్టనున్న గిరిప్రదక్షణ మార్గం నమూనా లేఅవుట్‌ను, అలాగే జింకల పార్క్ ప్రాజెక్టును కూడా పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జనసేన నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
