Koneru Konappa: రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీపై మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తాను ఎంతో ప్రేమగా చేసుకున్న రైతులను ఈ కాంగ్రెస్ పాలనలో పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. సిర్పూర్ నియోజకవర్గంపై ఈ ప్రభుత్వానికి ప్రేమే లేదని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి, జిల్లా మంత్రి సీతక్క పైనా తన నిరసనను వ్యక్తంచేశారు.
Koneru Konappa: కుమ్రంభీం జిల్లా కౌటాల మండల కేంద్రంలో తన అనుచరులతో జరిగిన సమావేశంలో కోనేరు కోనప్ప ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని, ఇప్పుడేమో కాంగ్రెస్ పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని కోనేరు కోనప్ప ఆందోళన వ్యక్తంచేశారు.
Koneru Konappa: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని, గత పదేండ్లలో రైతులకు ఏ ఇబ్బందులు లేకుండా చూసుకున్నామని, ఇప్పుడు రైతులను పట్టించుకునేవారే కరువయ్యారని కోనేరు కోనప్ప తెలిపారు. ఈ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎలాంటి మేలు జరగడమే లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
Koneru Konappa: 11 సార్లు మంజూరైన కౌటాల బ్రిడ్జిని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని కోనేరు కోనప్ప ఆరోపించారు. ఈ బ్రిడ్జి నిర్మాణం విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని కోరినా, మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిర్పూరు నియోజకవర్గాన్ని సీఎం రేవంత్‌రెడ్డి పట్టించుకోవడమే లేదని ఆరోపించారు.
Koneru Konappa: కాంగ్రెస్ పార్టీలో తనకు గౌరవం లేదని కోనేరు కోనప్ప తెలిపారు. గ్రూపు రాజకీయాలు కట్టి ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు ఘోరంగా మారాయని ఆరోపించారు. మే 25న చింతమానేపల్లిలో జరిగే ఆత్మీయ సమ్మేళనానికి తన అభిమానులు, కార్యకర్తలు తరలిరావాలని కోనేరు కోనప్ప పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా, పార్టీ మార్పుపై ఆరోజు ప్రకటిస్తారని అందరూ భావిస్తున్నారు.

