Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనతో తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో సందడి నెలకొంది. తన ఇష్టదైవమైన ఆంజనేయ స్వామిని దర్శించుకోవడంతో పాటు ఆలయ అభివృద్ధికి ఆయన నేడు శ్రీకారం చుట్టనున్నారు.
కొండగట్టుకు మహర్దశ: పవన్ కళ్యాణ్ శంకుస్థాపన
సుమారు రూ. 35.19 కోట్ల టీటీడీ నిధులతో నిర్మించనున్న భారీ భవనాలకు పవన్ కళ్యాణ్ నేడు భూమిపూజ చేయనున్నారు. భక్తుల కోసం 96 గదులతో కూడిన అత్యాధునిక ధర్మశాల, ఒకేసారి రెండు వేల మంది భక్తులు మాల విరమణ చేసుకునేలా విశాలమైన మండపాన్ని ఇక్కడ నిర్మించనున్నారు. గతంలో తానిచ్చిన హామీ మేరకు పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని, టీటీడీ నుంచి ఈ నిధులను మంజూరు చేయించారు.
ఉదయం హెలికాప్టర్‌లో కొండగట్టు చేరుకోనున్న ఆయన, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని, మధ్యాహ్నం జనసేన నాయకులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ముఖ్యంగా ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన ప్రతినిధులను ఆయన అభినందించనున్నారు. పవన్ పర్యటన దృష్ట్యా పోలీసులు కొండగట్టులో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
