Konda Surekha

Konda Surekha: నన్ను ఇబ్బంది పెడుతున్నారు.. కొండా సురేఖ

Konda Surekha: దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తనను, తన కుటుంబాన్ని ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం పార్టీలో, ప్రభుత్వంలో జరుగుతోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ముఖ్య నాయకులను కలిసి ఫిర్యాదు చేశారు. తనపై కుట్రలు జరుగుతున్నాయని, బీసీ మహిళనైన తనను ఇబ్బంది పెడుతున్నారని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రివర్గ సమావేశానికి గైర్హాజరై, ఆమె ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌లతో భేటీ అయ్యారు.

మంత్రి సురేఖ వద్ద ప్రైవేటు ఓఎస్డీగా పనిచేసిన నార్ల సుమంత్‌పై సూర్యాపేట జిల్లాలోని డెక్కన్‌ సిమెంట్స్‌ కంపెనీ యాజమాన్యాన్ని బెదిరించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని మరో మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రికి, మీనాక్షి నటరాజన్‌కు చెప్పడంతో, సుమంత్‌పై తగు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. దీంతో ప్రభుత్వం సుమంత్‌ను ఓఎస్డీ పదవి నుంచి తొలగించింది. అయితే, బుధవారం రాత్రి సుమంత్‌ కోసం గాలించిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మఫ్టీలో ఉన్నప్పటికీ, జూబ్లీహిల్స్‌లోని మంత్రి సురేఖ ఇంటికి నేరుగా వెళ్లడం సంచలనంగా మారింది. పోలీసులు అత్యుత్సాహం చూపించడం వల్లే ఈ వివాదం చెలరేగిందని, ఇంట్లో మంత్రి కుమార్తె సుస్మితా పటేల్‌ వారితో వాగ్వాదానికి దిగడం గందరగోళానికి దారి తీసిందని తాజా విచారణలో వెల్లడైంది.

సురేఖ ఫిర్యాదు: అంతర్గత వైరమే కారణమా?
మంత్రి సురేఖ తన కుమార్తె సుస్మితతో కలిసి భేటీలలో పాల్గొని, తన ఓఎస్డీపై వచ్చిన ఆరోపణలు, పోలీసులు ఇంటికి రావడం వంటి పరిణామాలను పార్టీ పెద్దలకు వివరించారు. ముఖ్యంగా, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సొంత పార్టీ నేతలతో కొనసాగుతున్న వైరంతో పాటు, తనను, కుటుంబాన్ని, తన అనుచరులను ఎవరెవరు ఎలా ఇబ్బందులు పెడుతున్నారో ఏకరువు పెట్టారు. ఈ రాజకీయ ఒత్తిళ్లు, పోలీసుల చర్యలపై ఆమె తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. సుమారు రెండున్నర గంటల పాటు సాగిన ఈ చర్చలో తనపై జరుగుతున్న కుట్రలను మీనాక్షి నటరాజన్‌కు సురేఖ వివరించినట్లు తెలుస్తోంది.

Also Read: Jagan and Google: తృప్తి చెందడంలో తప్పు లేదుగా..!

పార్టీ హామీ: పరిష్కారం దొరుకుతుందన్న ధీమాతో మంత్రి
పార్టీ పెద్దలతో భేటీ అనంతరం మంత్రి సురేఖ మీడియాతో మాట్లాడుతూ, “నా ఆలోచనలు, నాకున్న ఇబ్బందులు వారికి వివరించాను. వారు కూడా నా అభ్యర్థనను విని, తోటి మంత్రులతో సహా అందరితో కూర్చొని మాట్లాడి, త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నా సమస్యను వారికి వదిలేసి, వారిచ్చిన భరోసాతో వెళ్తున్నాను. పార్టీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటా” అని స్పష్టం చేశారు. అలాగే, హనుమకొండలోని తన నివాసం వద్ద భద్రత (సెక్యూరిటీ) తొలగించారంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ప్రచారం పూర్తిగా అసత్యమని ఆమె కార్యాలయం ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది.

మంత్రి భర్త, కాంగ్రెస్ నేత కొండా మురళి వరంగల్‌లో మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంటే తనకు అభిమానమని, ఆయన సీఎం కావాలని కోరుకున్నానని తెలిపారు. “రేవంత్‌రెడ్డికి, నాకు మధ్య ఎవరో విరోధం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా విషయం ఉంటే సీఎంను నేరుగా కలిసి మాట్లాడుతా. నాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. తప్పకుండా మాట నిలబెట్టుకుంటారన్న విశ్వాసం ఉంది” అని మురళి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఘటనపై తాను వరంగల్‌లో ఉన్నందున ఏమీ తెలియదని ఆయన తెలిపారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *