Konda surekha: యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామి దేవస్థానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో దేవస్థానం పాలనకు ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తూ చట్ట సవరణలు చేపట్టామని దేవాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ తెలిపారు. అయితే, టీటీడీకి స్వయం ప్రతిపత్తి ఉన్నప్పటికీ, యాదగిరిగుట్ట బోర్డు మాత్రం ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.
కేబినెట్ విస్తరణపై క్లారిటీ లేదు
రాష్ట్ర కేబినెట్ విస్తరణపై ఇప్పట్లో ఎటువంటి నిర్ణయం లేదని కొండా సురేఖ తెలిపారు. కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరుగుతుందనే దానిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
కేటీఆర్‌పై విమర్శలు
తెలంగాణ మాజీ మంత్రి కె. తారక రామారావుపై (KTR) విమర్శలు చేస్తూ, “సెల్ఫ్ డ్రైవింగ్‌పై ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు,” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, ఫోన్ ట్యాప్ చేసి రహస్యాలు తెలుసుకోవడమే కేటీఆర్ పని అని ఆరోపించారు.
పొట్టి శ్రీరాములు పేరు పెట్టడంపై అభ్యంతరం లేదు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. అయితే, కేంద్ర సంస్థలకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆమె తెలిపారు.
రాష్ట్రంలో దేవాదాయ పరిపాలన, కేబినెట్ విస్తరణ, రాజకీయ విమర్శలు ఇలా పలు అంశాలపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.