Konda surekha: రాష్ట్రంలోని దేవాదాయ శాఖ భూములపై అక్రమాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ఈ భూముల జోలికొస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం చెంగిచెర్లలో దేవాదాయ శాఖ భూములు ఆక్రమణకు గురవుతున్నట్టు వచ్చిన ఫిర్యాదుపై, మంత్రి కొండా సురేఖ గురువారం చెంగిచెర్ల ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్శనలో ఆమెతో పాటు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, రెవెన్యూ మరియు దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ — చెంగిచెర్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్లు 33/8 (10.35 ఎకరాలు), 33/9 (13 ఎకరాలు), 33/10 (6.23 ఎకరాలు) కలిపి మొత్తం 29.58 ఎకరాల భూమిని 1968లో టీఎల్పీ చారిటబుల్ ట్రస్ట్‌కు తోటకూర ఎల్లయ్య యాదవ్, రామయ్య చౌదరి ఇతరుల పేరిట రిజిస్టర్ చేశారని తెలిపారు. అయితే 1976లో సీలింగ్ చట్టం ప్రకారం ఈ భూములు దేవాదాయ శాఖ ఆధీనంలోకి వచ్చాయని పేర్కొన్నారు.
ప్రభుత్వ భూముల రక్షణే తాము కట్టుబడి ఉన్నదని, అవసరమైతే కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమన్నారు. ప్రజలు దేవాదాయ భూములపై కన్నేశారంటే కఠినంగా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.