Konda surekha: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ఈవో రమాదేవిపై జరిగిన దాడి ఘటనపై తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు. దేవాలయ భూములను ఆక్రమించేందుకు ఎవరు ప్రయత్నించినా ఉపేక్షించబోమని హెచ్చరించిన ఆమె, దాడికి పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆలయ అధికారులపై దాడులు ఏ మాత్రం అంగీకారయోగ్యమన్నారు.
ఈవో రమాదేవి భద్రాచలం ఆలయానికి చెందిన భూముల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిసి, వాటిని అడ్డుకునేందుకు మంగళవారం పురుషోత్తపట్నం గ్రామానికి సిబ్బందితో వెళ్లారు. అక్కడి కొంతమంది స్థానికులు ఆమెపై దాడికి పాల్పడినట్టు సమాచారం. ఈ ఘటనలో ఆమె తీవ్ర అస్వస్థతకు గురై స్పృహతప్పి పడిపోయారు. వెంటనే ఆమెను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు.
ఈ దాడి ఘటన రెండు రాష్ట్రాల మధ్య సున్నిత పరిణామాలకు దారితీయవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, మంత్రి కొండా సురేఖ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని దీనిపై స్పందించాలని కోరారు. భద్రాచలం ఆలయ భూముల వివాదాన్ని శాశ్వతంగా పరిష్కరించి, ఆలయ ఆస్తులను పరిరక్షించే చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.