Konaseema: కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద సముద్రం అనూహ్యంగా వెనక్కి 500 మీటర్ల మేర తగ్గడం తీవ్ర కలకలాన్ని రేపింది. సముద్రం వెనక్కి వెళ్ళిన ప్రాంతమంతా ఇప్పుడు మోకాళ్ల లోతులోని ఒండ్రు మట్టితో నిండి ఉండటంతో, అంతర్వేది సహా చుట్టుపక్కల గ్రామాల ప్రజలలో భయాందోళనలు గంభీరంగా పెరిగాయి. స్థానికులు గతంలో పెద్దల చెప్పిన “సునామీ ముందు సముద్రం వెనక్కి వెళ్తుంది” అనే మాటలను గుర్తుచేసుకుంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా ఇసుక మేటలతో ఉండే తీరం, ఈసారి ఒండ్రుతో నింపబడిన విధంగా కనిపించడం భయాన్ని మరింత పెంచిందని వారు చెబుతున్నారు. గతంలో కూడా సముద్రం కొన్ని మీటర్ల మేర వెనక్కి తగ్గిన సందర్భాలు ఉండగా, ఇసుక మేటలు ఏర్పడ్డాయని గుర్తుచేసుకుంటున్నారు.
కానీ సారి అర కిలోమీటర్ దూరం వెనక్కి తగ్గడం, ఒండ్రు మట్టి పేరుకుపోవడం కొత్త అనూహ్య పరిణామం కావడం వల్ల, స్థానిక మత్స్యకారులు, గ్రామస్తులు కారణాలను తెలియజేయాలని, అధికారులు త్వరగా స్పందించాలని ఆశిస్తూ ఆందోళనతో ఎదురుచూస్తున్నారు.