Konaseema: కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. రాబోయే సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆత్రేయపురం మండలం పులిదిండి గ్రామంలో పెద్ద ఎత్తున పడవ పోటీలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం పడవల ‘ట్రయల్ రన్’ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి కలెక్టర్ స్వయంగా అక్కడికి చేరుకున్నారు.
పోటీలను ఉత్సాహంగా ప్రారంభించే క్రమంలో, ప్రమాదవశాత్తు కలెక్టర్ మహేష్ కుమార్ అదుపు తప్పి కాలువలో పడిపోయారు. ఒక్కసారిగా ఆయన నీళ్లలో పడిపోవడంతో అక్కడున్న వారంతా ఆందోళనకు గురయ్యారు. అయితే, ముందస్తు జాగ్రత్తగా అక్కడ అందుబాటులో ఉన్న గజ ఈతగాళ్లు వెంటనే స్పందించారు. వారు తక్షణమే కాలువలోకి దూకి కలెక్టర్‌ను సురక్షితంగా బయటకు తీసి, మరో పడవలోకి చేర్చారు.
సమయానికి ఈతగాళ్లు అప్రమత్తంగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కలెక్టర్ సురక్షితంగా ఉండటంతో అధికారులు, స్థానికులు ఊరట చెందారు. పండుగ సంబరాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ పోటీల వద్ద భద్రతా ఏర్పాట్లను మరింత పెంచాలని ఈ ఘటనతో అధికారులు భావిస్తున్నారు.
