Komatireddy Venkatreddy: రాష్ట్రంలో రహదారులు, భవనాల శాఖ అభివృద్ధి పనులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంగళవారం హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ శాఖకు సంపూర్ణ మద్దతు ఇవ్వడంతో నిధులపై ఆందోళన లేకుండా పనులను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
“ప్రమోషన్లు, పోస్టింగుల విషయంలో ముఖ్యమంత్రి వద్ద నుంచి అనుమతులు తీసుకుని మిమ్మల్ని సజావుగా నియమించాం. ఇప్పుడు మీరు పనిచేసే సమయం వచ్చింది. ప్రతిఫలం ఇవ్వాలి” అని అధికారులను ఉద్దేశించి మంత్రి స్పష్టం చేశారు.
నిధుల విషయంలో భరోసా
రహదారుల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదని మంత్రి భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా పేర్కొన్నారు.
రహదారి ప్రమాదాల నివారణపై దృష్టి
రహదారులపై ప్రమాదాలకు కారణమయ్యే బ్లాక్ స్పాట్లు, వర్టికల్ కర్వులు వంటి అంశాలను ముందుగానే గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలని ఇంజినీర్లకు సూచించారు.
రెండు రోజుల్లో హ్యామ్ (HAM) పద్ధతిలో చేపట్టిన రోడ్లపై ప్రత్యేక సమీక్ష జరుపుతామని తెలిపారు.