KomatiReddy venkatreddy: 10 ఏళ్ల అయినా సమస్యలు తీరలే..

KomatiReddy venkatreddy: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తొలి పదేళ్లలో కూడా ప్రజల సమస్యలు పూర్తిగా తీరలేదని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. నల్లొండ జిల్లా బొట్టుగూడలో ‘కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్’ ఆధ్వర్యంలో రూ.8 కోట్లతో నిర్మించిన పాఠశాల ప్రారంభోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

పాఠశాల ప్రారంభోత్సవ వేదికపై మాట్లాడుతూ, సరైన విద్య అందితేనే పేదల సమస్యలు తొలగుతాయని కోమటిరెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలను విద్యపై ఖర్చు చేస్తున్నప్పటికీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి పదేళ్లలో ఆశించిన స్థాయిలో ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదని తెలిపారు. బొట్టుగూడ స్కూల్‌ను దేశంలోనే ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దుతామని, ఇలాంటి ప్రభుత్వ స్కూల్ ఎక్కడా లేదని గర్వంగా పేర్కొన్నారు.

ఈ పాఠశాలలో కంప్యూటర్లు, డిజిటల్ బోర్డులు, క్రీడా సదుపాయాలు వంటి ఆధునిక వసతులు కల్పించినట్లు మంత్రి వివరించారు. అయితే విద్యార్థులు మార్కుల్లో ముందుంటున్నప్పటికీ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు (స్కిల్స్) లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని ఆయన అన్నారు. విద్యార్థుల నైపుణ్యాభివృద్ధిపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. బొట్టుగూడ స్కూల్‌ను రాష్ట్రంలోనే అత్యుత్తమ మోడల్ స్కూల్‌గా అభివృద్ధి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *