Komatireddy Venkata Reddy: ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో 10 మంది చేరికపై సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసిన సమయంలో శుక్రవారం (ఆగస్టు 1) ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
Komatireddy Venkata Reddy: ఆ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరనేలేదు.. వారు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్తున్నారు.. తమకేమీ సంబంధం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తాము బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ ఒక్క ఎమ్మెల్యేను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోలేదని కుండబద్దలు కొట్టినట్టుగా తేల్చి చెప్పారు.
Komatireddy Venkata Reddy: బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అరికెపూడి గాంధీ, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, డాక్టర్ సంజయ్, ప్రకాశ్‌గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారి చేరికపై అభ్యంతరాలను వ్యక్తంచేస్తూ వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు తాజాగా సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది.
Komatireddy Venkata Reddy: ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. అసలు తమ పార్టీలోనే చేరలేదంటూ ఆయన పేర్కొనడంపై ఏదో మతలబు ఉన్నదన్న విషయం వెలుగు చూస్తున్నది. తమ పార్టీకి వారిని దూరంగా ఉంచే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఫిరాయింపులను తప్పించుకునేందుకే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.