Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ పార్టీలో అన్నదమ్ములైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తానని తాను ఎప్పుడూ హామీ ఇవ్వలేదని, అది తన చేతుల్లో లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి.
“నాకు తెలియదు.. అది నా పని కాదు”
రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి విషయంలో ఇటీవల వెంకటరెడ్డిని మీడియా ప్రశ్నించగా, ఆయన స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. “రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తానని నేను ఎప్పుడూ హామీ ఇవ్వలేదు. ఆ విషయం నాకు తెలియదు. అది నా చేతుల్లో లేని విషయం. దాని గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడగండి” అని ఆయన అన్నారు. అంతేకాకుండా, “నా స్వార్థం నాది. నాకు సంబంధం లేని విషయాలు నన్ను అడగకండి” అని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
అన్నదమ్ముల మధ్య గ్యాప్?
ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఎన్నికలకు ముందు రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరే సమయంలో, ఆయనకు మంత్రి పదవి ఇస్తామని వెంకటరెడ్డి హామీ ఇచ్చారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ వార్తలను ఖండించినట్లుగా ఉన్నాయి. దీంతో అన్నదమ్ముల మధ్య దూరం పెరిగిందని, రాజగోపాల్ రెడ్డికి వెంకటరెడ్డి హ్యాండ్ ఇచ్చారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
రాజగోపాల్ రెడ్డి సైలెంట్
మరోవైపు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి ఇంకా స్పందించలేదు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత, ఆయనకు పార్టీలో సరైన ప్రాధాన్యత లభించలేదనే అభిప్రాయాలు ఉన్నాయి. వెంకటరెడ్డి వ్యాఖ్యలతో రాజగోపాల్ రెడ్డి భవిష్యత్ రాజకీయ ప్రయాణం ఎలా ఉండబోతుందోనని చర్చలు మొదలయ్యాయి.
Also Read: KTR: “అంతా మాటలేనా? బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు
కోమటిరెడ్డి సోదరుల మధ్య ఉన్న ఈ విభేదాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత కలహాలకు మరో ఉదాహరణగా నిలిచాయి. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఈ తాజా పరిణామం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారే అవకాశం ఉంది.
