Komatireddy Venkat Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటుగా సమాధానమిచ్చారు. అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మాట్లాడిన ఆయన, కవిత రాజకీయ తీరుపై పలు సందేహాలు వ్యక్తం చేశారు. అసలు కవిత ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారా? లేక బయటకు వచ్చేశారా? అనే విషయంపై క్లారిటీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ గురించి మాట్లాడగానే స్పందించే కవిత, అదే పార్టీకి చెందిన హరీష్ రావుపై విమర్శలు వచ్చినప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ఇది చూస్తుంటే కేసీఆర్ సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేయడానికి కవితను వాడుతున్నారా అనే అనుమానం కలుగుతోందని ఆరోపించారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పులు చేసిందని కవిత స్వయంగా ఒప్పుకోవడాన్ని మంత్రి స్వాగతించారు. అయితే, కేసీఆర్ పాలనలో నల్లగొండ జిల్లాకు జరిగిన అన్యాయంపై కూడా ఆమె మాట్లాడి ఉంటే బాగుండేదని హితవు పలికారు. కేసీఆర్ ప్రతిరోజూ అసెంబ్లీకి వస్తేనే పార్టీ బాగుపడుతుందని కవిత అనడం చూస్తుంటే, ఆమె పార్టీలోని ఇతర నేతలను తక్కువ చేసి మాట్లాడుతున్నట్లు కనిపిస్తోందని మంత్రి విమర్శించారు.
ఇక తనపై వచ్చిన వ్యక్తిగత విమర్శలకు స్పందిస్తూ.. తాను ఎప్పుడూ పదవుల కోసం పాకులాడలేదని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం గతంలోనే తన మంత్రి పదవిని త్యాగం చేసిన చరిత్ర తనదని గుర్తు చేశారు. తనకు కవితపై ఎలాంటి కోపం లేదని, కేవలం ఒక పెద్దన్నగా ఆమెకు సలహా మాత్రమే ఇస్తున్నానని వ్యాఖ్యానించారు. సొంత పార్టీ నేతలను దూరం చేసుకునేలా కవిత వ్యవహరించడం ఆమె రాజకీయ భవిష్యత్తుకే ప్రమాదకరమని హెచ్చరించారు.
