Komatireddy Venkat Reddy: సినిమా టికెట్ల ధరల పెంపు, చిత్ర పరిశ్రమ వ్యవహారాలపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ప్రభాస్ నటించిన “ది రాజాసాబ్” సినిమా టికెట్ల ధరల పెంపు విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆయన స్పందించారు. ఇకపై సినిమా పరిశ్రమకు సంబంధించిన ఏ విషయంలోనూ తాను జోక్యం చేసుకోనని, ధరల పెంపునకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.
ధరల పెంపుపై హైకోర్టు సీరియస్ రాజాసాబ్ సినిమా టికెట్ల ధరలను పెంచుకోవచ్చని ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఈ ఉత్తర్వులు ఎలా ఇచ్చారని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మంత్రులు ఒకవైపు ధరలు పెంచమని చెబుతుంటే, అధికారులు వెనుక నుంచి మెమోలు జారీ చేయడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఈ న్యాయపరమైన వివాదం చర్చనీయాంశంగా మారిన సమయంలో మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఆ చేదు జ్ఞాపకమే కారణం సినిమా ఇండస్ట్రీకి తాను ఎందుకు దూరంగా ఉండాలనుకుంటున్నారో మంత్రి వివరిస్తూ పాత సంఘటనలను గుర్తు చేసుకున్నారు. “పుష్ప-2” సినిమా విడుదల సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆయన అన్నారు. ఆ వేడుకకు అనుమతి ఇచ్చినందుకు తాను ఇప్పటికీ బాధపడుతున్నానని, ఆ ఘటనలో గాయపడిన వారికి తన సొంత డబ్బులతో వైద్యం చేయించానని తెలిపారు. ఆ చేదు అనుభవం తర్వాతే సినిమా ఇండస్ట్రీ గొడవల్లోకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
నా దగ్గరకు రావద్దు.. నాకు సంబంధం లేదు పుష్ప-2 మరియు అఖండ-2 సినిమాల సమయం నుంచే తాను క్లారిటీగా ఉన్నానని మంత్రి పేర్కొన్నారు. “టికెట్ రేట్లు పెంచాలని నా దగ్గరకు రావద్దని ముందే చెప్పాను. ఇప్పుడు కూడా నన్ను ఎవరూ కలవడం లేదు. పెరిగిన టికెట్ ధరలకు నాకు ఎలాంటి సంబంధం లేదు” అని ఆయన కుండబద్ధలు కొట్టారు. సినిమా రంగంపై అతిగా దృష్టి పెట్టడం మానేశానని, ప్రజలకు సంబంధించిన ఇతర పనులపైనే తాను ఫోకస్ చేస్తున్నానని ఆయన వెల్లడించారు.
