Komatireddy Raj Gopal Reddy: కాంగ్రెస్ అధిష్టానమే హామీ ఇచ్చినట్టుగా ప్రచారం జరిగిన ఆ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి దక్కేనా? అనూహ్యంగా అనుకోని రీతిలో మహ్మద్ అజారుద్దీన్‌ను మంత్రి పదవి వరించిన వేళ మరింత ఆసక్తి నెలకొన్నది. సీనియర్ ఎమ్మెల్యేలైన సుదర్శన్‌రెడ్డి, ప్రేమ్ సాగర్‌రావుకు కీలక నామినేటెడ్ పదవులు దక్కడంతో ఉత్కంఠకు దారితీసింది. ఇది దేనికి సంకేతం అన్న సంశయం ప్రతి ఒక్కరిలోనూ ఉన్నది.
Komatireddy Raj Gopal Reddy: బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పుడు మంత్రి పదవి ఇస్తామన్న హామీని అధిష్టానం ఇచ్చిందని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో పాటు ఆ పార్టీ రాష్ట్ర కీలక నేతలు కూడా పలు సందర్భాల్లో అదే విషయాన్ని చెప్పడంతో దానికి బలం చేకూరింది. ప్రతి సందర్భంలో రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి వస్తుందన్న ఊహాగానాలు ఊగిసలాడాయి.
Komatireddy Raj Gopal Reddy: ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇదే సమయంలో రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఖాయమైందని ప్రచారం జరిగింది. కానీ, అనూహ్యంగా ఆ జాబితాలో ఆయన పేరు లేకుండా పోయింది. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ ఆ స్థానం టికెట్‌ను త్యాగం చేసిన అజారుద్దీన్‌ను మంత్రి పదవి వరించింది. ఆయన ఒక్కరే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
Komatireddy Raj Gopal Reddy: ఇదే సమయంలో మంత్రి పదవి తప్పక వస్తుందని ఆశించిన సుదర్శన్‌రెడ్డికి ప్రభుత్వ సలహాదారుగా, ప్రేమ్‌సాగర్‌రావును సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్‌గా క్యాబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం నియామకం చేపట్టింది. ఈ పరిణామంతో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి దక్కడానికి అడ్డంకి తొలిగినట్టేనని ఆయన వర్గం వారు భావిస్తుండగా, ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యల ఫలితంగా ఆయన మంత్రి పదవి దక్కడం కష్టమేనని ఇతర వర్గం భావిస్తున్నారు.
Komatireddy Raj Gopal Reddy: ఇక మిగిలింది కేవలం రెండు మంత్రి పదవులే ఖాళీగా ఉన్నాయి. ఈ దశలో ఏదైనా అత్యవసరం వేళ, అవసరం మేరకు ఆ పదవులను అధిష్టానం అలాగే ఉంచే అవకాశం ఉన్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ రెండింటిలోనే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి దక్కాలి. లేదంటే ఖాళీగా ఉండాల్సిందే. ఇప్పటి వరకైతే ఆయనకు ఎలాంటి హామీ లేకపోయినప్పటికీ త్వరలో ఓ క్లారిటీ వచ్చే అవకాశమైతే ఉన్నది. వేచి చూడాలి మరి.

