Komatireddy Raj Gopal Reddy: మునుగోడు నియోజకవర్గంలో మద్యం దుకాణాలకు స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పెట్టిన నిబంధనల అంశం మలుపులు తిరుగుతున్నది. ఎక్కడ ఎలా ఉన్న తన నియోజకవర్గం పరిధిలోని మద్యం దుకాణాల లైసెన్స్ పొందిన వ్యాపారులు కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందేనని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఏకంగా హెచ్చరికలే జారీచేశారు. దీంతో మద్యం దుకాణాలకు దరఖాస్తులు సమర్పించిన వారు ఇంకా లాటరీ తీయకముందే బేలెత్తిపోతున్నారు.
Komatireddy Raj Gopal Reddy: సాయంత్రం 4 గంటల తర్వాత నుంచి రాత్రి 9 గంటల వరకే మద్యం దుకాణాలు తెరిచి ఉంచాలని, పర్మిట్ రూములు ఉండరాదని, ఊరికి దూరంగా దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బహిరంగంగానే నిబంధనల చిట్టా విప్పారు. మునుగోడు నియోజకవర్గంలో కొత్త మద్యం దుకాణాలు పెట్టే వారు వీటిని కచ్చితంగా పాటించాలని, లేకుంటే నష్టపోతారంటూ ఆయన హెచ్చరించారు.
Komatireddy Raj Gopal Reddy: దీంతో టెండర్లు వేయడానికే కొందరు వ్యాపారులు భయపడ్డారు. ఆలస్యంగానైనా టెండర్లు వేసిన వారు ఏకంగా ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. ఈ విషయంపై స్పందించిన ఆయన వారికి భరోసా ఇచ్చేలా తేల్చి చెప్పారు. రాష్ట్రమంతటా ఒకటే నిబంధనలు ఉంటాయి, ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో రూల్ ఉండదు, అందరూ ఆ నిబంధనలనే అనుసరించాలి అని జూపల్లి వ్యాఖ్యానించారు.
Komatireddy Raj Gopal Reddy: ఇదిలా ఉండగా, మరో అంశం ఆసక్తికరంగా మారింది. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పెట్టిన నిబంధనల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్‌గానే ఉన్నట్టు తెలుస్తున్నది. దీనిపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పూర్తి నివేదికను పంపినట్టు కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో మునుగోడు వైన్ షాపుల భవితవ్యం ఎటు దారితీస్తుందో వేచి చూడాలి మరి.