Kollu ravindra: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌పై రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఐదేళ్ల జగన్ పాలనలో ప్రజలు అనుభవించిన అరాచకాలు, అవ్యవస్థల కారణంగానే ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఇంటికే పంపేశారని ఘాటుగా వ్యాఖ్యానించారు.
శుక్రవారం విజయవాడ పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడిన కొల్లు రవీంద్ర, “జగన్ చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు వినగానే ప్రజలు నవ్వుకుంటున్నారు. అవి హాస్యాస్పదం తప్ప మరేదీ కావు. నిజంగా ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం రాత్రింబవళ్లు పనిచేసే నాయకుడు చంద్రబాబే” అని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఇటీవల నేపాల్‌లో జరిగిన హింసాత్మక ఘటనలపై మంత్రి స్పందించారు. అక్కడ చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంలో మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని గుర్తు చేశారు. ఇదే సందర్భంలో గతంలో ఉత్తరాఖండ్ వరదలు, విశాఖపట్నం హుద్‌హుద్ తుపాను వంటి విపత్తుల సమయంలోనూ చంద్రబాబు స్వయంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారని గుర్తుచేశారు.
“ఆపదలో ప్రజలకు అండగా నిలిచి భరోసా కల్పించడం టీడీపీ ప్రభుత్వానికే సాధ్యం. అదే మా పార్టీ ప్రత్యేకత” అని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.

