Kollu ravindra: రాష్ట్ర విద్యార్థులకు ఊరట – 1,788 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల I’ll

Kollu ravindra: రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. గత ప్రభుత్వం నుంచి పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల్లో భాగంగా రూ.1,788 కోట్లను ప్రభుత్వం విడుదల చేసినట్లు గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సోమవారం ప్రకటించారు. పండుగ సందర్భంలో విద్యార్థులకు అందించిన గొప్ప కానుక ఇదేనని ఆయన అభివర్ణించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. “ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్క పేద విద్యార్థి చదువు మధ్యలో ఆగిపోకుండా చూడటం మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం” అని స్పష్టం చేశారు.

గత జగన్‌ ప్రభుత్వ హయాంలో విద్యా రంగం పూర్తిగా నిర్వీర్యమైందని కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.2,832 కోట్లు, వసతి దీవెన కింద రూ.989 కోట్లు, పీజీ ఫీజుల కింద రూ.450 కోట్లు బకాయిలు పెట్టి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ బకాయిల కారణంగా కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల సర్టిఫికెట్లు నిలిపివేశాయని, ఫలితంగా వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ గత ప్రభుత్వం దానిపై స్పందించలేదని ఆయన విమర్శించారు. ప్రజాధనాన్ని రంగుల పిచ్చి ప్రాజెక్టులకు, పేరులేని కంపెనీలకు ట్యాబ్‌ల కాంట్రాక్టుల రూపంలో దుర్వినియోగం చేశారని, విద్యా కానుక నిధులను సైతం తాడేపల్లి ప్యాలెస్ పనులకు మళ్లించారని ఆరోపించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థుల సమస్యలపై దృష్టి సారించిందని మంత్రి రవీంద్ర తెలిపారు. ఇప్పటివరకు 10 లక్షల మందికి పైగా విద్యార్థుల సర్టిఫికెట్లు విడుదలయ్యేలా చర్యలు తీసుకున్నామని, ఇకపై ఫీజుల కోసం విద్యార్థులను వేధించే కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కృషితో పాత ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని తిరిగి అమలు చేస్తున్నామని, దీని ద్వారా తల్లిదండ్రులపై భారీ భారం తగ్గుతుందని అన్నారు. ఫీజు బకాయిలపై అసెంబ్లీలో చర్చకు తాము సిద్ధమని, కానీ నిజాలు బహిర్గతం అవుతాయనే భయంతో వైసీపీ నేతలు పారిపోయారని ఎద్దేవా చేశారు.

విద్యాశాఖలో సంస్కరణలు ప్రారంభమయ్యాయని మంత్రి వివరించారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పారదర్శకంగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లు నిర్వహించామని, ‘డొక్కా సీతమ్మ భోజనం’ పథకం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నామని తెలిపారు. ‘తల్లికి వందనం’ పథకంతో ప్రతి బిడ్డకు మేలు జరుగుతోందని, ఉపాధ్యాయ బదిలీలు ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పూర్తిచేశామని, మెగా డీఎస్సీ నిర్వహించి తొలి సంతకం హామీని నిలబెట్టుకున్నామని గుర్తుచేశారు.

గతంలో చంద్రబాబు హయాంలో 1.96 లక్షల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని, విదేశీ విద్య పథకాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు. అంతేకాకుండా క్వాంటం వ్యాలీ, గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలను రాష్ట్రానికి రప్పించి 20 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *