Kollu ravindra: వైసీపీ పార్టీ అబద్ధాలు, విద్వేషాలతో కూడిన దిగజారుడు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో విమర్శించారు. బుధవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
మంత్రి మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం సమన్వయం చేస్తూ ముందుకు సాగుతోంది. కానీ వైసీపీ నాయకులు మాత్రం సోషల్ మీడియా, సాక్షి పత్రికల ద్వారా విషప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నారు” అని అన్నారు.
గతంలో ప్రజా వ్యతిరేక విధానాలపై న్యాయస్థానాలు ప్రశ్నిస్తే, న్యాయమూర్తులపై కూడా వైసీపీ దుష్ప్రచారం చేయించిందని కొల్లు రవీంద్ర గుర్తుచేశారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో నిజాలు బయటపడటంతో, ఇప్పుడు ఆయన కుమార్తె సునీత, ఆమె భర్తపై బురద చల్లుతున్నారని ఆరోపించారు. “ఇంత నీచమైన స్థాయిలో సొంత చెల్లిపైనా పోస్టులు పెట్టించిన రాజకీయ నాయకులు ఎక్కడా ఉండరని” వ్యాఖ్యానించారు.
తిరుపతి గోశాలలో ఆవులు చనిపోయాయంటూ, భక్తులు ఆకలితో అలమటిస్తున్నారంటూ వైసీపీ అబద్ధాలు ప్రచారం చేసిందని ఆయన విమర్శించారు. అలాగే, పులివెందుల, ఒంటిమిట్టలో రిగ్గింగ్ జరిగిందని ఇతర రాష్ట్రాల వీడియోలను చూపించారని మండిపడ్డారు. విజయవాడ వరదల్లో కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు అయిన రూ.23 లక్షల ఖర్చును రూ.23 కోట్లుగా చూపారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పునఃప్రారంభించిన అన్న క్యాంటీన్లపై కూడా విషప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.
పేర్ని నానిపై కూడా కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “పేర్ని నాని ఒక బఫూన్‌లా తయారయ్యారు. ఆయన నటనకు ఆస్కార్, భాస్కర్ అవార్డులు ఇవ్వొచ్చు” అంటూ ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ నుంచి నరుక్కుంటూ వస్తామంటూ బెదిరించడం, చీకట్లో దాడులు చేయమని రెచ్చగొట్టడం వైసీపీ నేతల సంస్కృతని అన్నారు.
ఇటీవల ధర్నా సందర్భంలో ఒకరికి మద్యం తాగించి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను తిట్టించడాన్ని పేర్ని నాని సమర్థించడం సిగ్గుచేటని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందడమే జగన్, పేర్ని నాని తతంగమని ఆయన ఆరోపించారు. “మచిలీపట్నంలో రజకుల ఇళ్లను కూల్చినప్పుడు పేర్ని నానికి వారిపై ప్రేమ గుర్తుకురాలేదా?” అంటూ ప్రశ్నించారు.