Kollu ravindra: జగన్ 11 మంది ఎమ్మెల్యేలని అసెంబ్లీకి తీసుకురావాలి

Kollu ravindra: మంత్రి కొల్లు రవీంద్ర తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ అంశంపై వైసీపీ అధినేత జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ అంశంపై చర్చించేందుకు దమ్ము, ధైర్యం ఉంటే ఈ నెల 11న జరిగే అసెంబ్లీ సమావేశాలకు 11 మంది సభ్యులతో రావాలని ఆయన సవాల్ విసిరారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి ప్రసాదం తయారీకి వాడే నెయ్యిలో భారీ అక్రమాలు జరిగాయని, నిబంధనలు సడలించి అనర్హ డెయిరీలకు ఆర్డర్లు ఇచ్చారని ఆరోపించారు.

జగన్ పాలనలో కేవలం దోపిడీ కోసమే తనకు అనుకూలమైన సంస్థలకు లబ్ధి చేకూర్చారని కొల్లు రవీంద్ర విమర్శించారు. 4 లక్షల లీటర్ల ఆవుపాలు అవసరం అనే నిబంధనను ఎందుకు తొలగించారని ప్రశ్నిస్తూ, పాలే లేని డెయిరీల నుంచి నెయ్యి కొనుగోలు చేసి ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. ఈ నెయ్యిలో జంతు కొవ్వు అవశేషాలు, రసాయనాలు ఉన్నట్లు ప్రాథమికంగా తెలిసిందని తెలిపారు.

లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో మోనో గ్లిజరైట్, మీటా క్యారటిన్, ఎసిడిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ వంటి రసాయనాలు ఉన్నాయని వెల్లడించారు. మోనో గ్లిజరైట్‌లో జంతు లేదా వృక్షజన్య కొవ్వు ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారని పేర్కొన్నారు. దేవుడి ప్రసాదాన్ని కూడా కల్తీ చేసిన పాపం తేలికగా మర్చిపోలేమని, పూర్తి నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని నిజాలు బయటపడతాయని కొల్లు రవీంద్ర అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *