Virat Kohli In Trouble: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు విజయోత్సవ కార్యక్రమం చుట్టూ ముదిరిన వివాదం ఇప్పుడు క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ వరకు చేరింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇటీవల నిర్వహించిన ఈ వేడుకలో తొక్కిసలాట చోటుచేసుకొని 11 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ప్రముఖులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా శివమొగ్గ జిల్లాకి చెందిన “రియల్ ఫైటర్స్ ఫోరం” అధ్యక్షుడు ఏఎం వెంకటేష్, కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో విరాట్ కోహ్లీపై ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమానికి విరాట్ ప్రమోషనల్ ముఖంగా వ్యవహరించాడని, ఉచిత పాసులు, ప్లేయర్లను కలిసే అవకాశాల వంటివి ప్రచారం చేయడం వల్లే పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ స్టేడియంకు వెల్లివచ్చారని ఆయన ఆరోపించారు. దీని ఫలితంగా తొక్కిసలాట జరిగిందని, కాబట్టి కోహ్లీకి కూడా బాధ్యత ఉందని పేర్కొన్నారు.
పోలీసులు ఈ ఫిర్యాదును ఇప్పటికే నమోదైన కేసులో భాగంగా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికీ ఈ కేసు విచారణ కొనసాగుతోంది. తొక్కిసలాట ఘటనపై ఇప్పటికే ఆర్సీబీ ఫ్రాంచైజీ, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ DNA ఎంటర్‌టైన్‌మెంట్, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA)పై కేసులు నమోదయ్యాయి. ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలే సహా నాలుగు మంది అధికారులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసును సీఐడీకి బదిలీ చేశారు.
ఈ సంఘటనకు సంబంధించి భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ముఖ్యంగా:
-
సెక్షన్ 105: హత్యతో సమానం కాని నేరపూరిత నరహత్య
-
సెక్షన్ 115(2): స్వచ్ఛందంగా గాయపరిచే చర్యలు
-
సెక్షన్ 118(1), 118(2) 3(5): తీవ్రమైన గాయాలు కలిగించే ఉద్దేశ్యంతో సంయుక్తంగా చర్యలు
-
సెక్షన్ 190: చట్టవిరుద్ధ గుమికూడుదల
-
సెక్షన్ 132: ప్రభుత్వ ఉద్యోగిని అడ్డగించడం
-
సెక్షన్ 125A, 125B: నిర్లక్ష్యం వల్ల ప్రాణాపాయం
ఇక, మరోవైపు తొక్కిసలాటలో గాయపడ్డ రోలాండ్ గోమ్స్ అనే వ్యక్తి కూడా స్టేషన్లో ఫిర్యాదు చేశారు. “ఆర్సీబీ సోషల్ మీడియా పోస్ట్ చూసి వచ్చాను, గేట్ 17 వద్ద లోపలికి వెళ్లే క్రమంలో తోపులాట జరిగి నా భుజం కీలు జారింది” అని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ENG vs IND: ఇండియా-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కు లెజెండరీ క్రికెటర్ల పేర్లు
దీంతోపాటు, బీజేపీ ప్రతినిధుల బృందం కూడా కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్లపై కూడా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేసింది.
ఈ మొత్తం వ్యవహారంపై అధికారుల నుంచీ, క్రికెట్ ప్రేమికుల నుంచి, రాజకీయ పార్టీల దాకా స్పందనలు వస్తున్నాయి. విరాట్ కోహ్లీపై ఆరోపణలు తీవ్రంగా మారుతున్నాయి. ఇది తేల్చేందుకు విచారణలో తుది నివేదిక ఎంతో కీలకంగా మారనుంది.