Air India: ముంబై విమానాశ్రయంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం. కొచ్చి నుంచి ముంబై వస్తున్న ఎయిర్ ఇండియా విమానం రన్‌వేపై ల్యాండ్ అవుతుండగా జారింది. ఈ ఘటనతో విమానంలో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
రన్‌వేపై జారిన విమానం.. ప్రయాణికుల పరుగులు
సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. కొచ్చి నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగుతున్న సమయంలో ఒక్కసారిగా రన్‌వేపై అదుపుతప్పి జారింది. దీంతో విమానం అటూఇటూ ఊగిపోయింది. లోపల ఉన్న ప్రయాణికులు ఏం జరుగుతుందో తెలియక భయంతో వణికిపోయారు. విమానం నిలిచిన వెంటనే, ప్రాణ భయంతో పరుగులు తీస్తూ ఫ్లైట్ దిగిపోయారు.
భారీ వర్షమే కారణం: ఎయిర్‌లైన్స్ అధికారులు
ఈ ఘటనకు భారీ వర్షమే కారణమని ఎయిర్‌లైన్స్ అధికారులు వెల్లడించారు. ముంబైలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రన్‌వేపై నీరు నిలిచి, జారిపోయే అవకాశం పెరిగిందని తెలిపారు. అయితే, పైలట్లు సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల పెను ప్రమాదం తప్పిందని అధికారులు వివరించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని, ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని ఎయిర్ ఇండియా ప్రకటించింది.

