Kishan Reddy

Kishan Reddy: అమరావతికి కిషన్ రెడ్డి మద్దతు.. రాజధానిగా చట్టబద్ధత బిల్లుకు గ్రీన్ సిగ్నల్

Kishan Reddy: అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తించే బిల్లుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పూర్తి మద్దతు ప్రకటించారు. లోక్‌సభలో ఈ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి విషయంలో ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ముందుకు సాగాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తవుతున్నా, ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌కు ఒక శాశ్వత రాజధాని లేకపోవడం చాలా బాధాకరమని ఆయన అభిప్రాయపడ్డారు.

అమరావతి నగరం అద్భుతమైన రాజధానిగా ఎదగాలని, అక్కడ అన్ని రకాల సౌకర్యాలు రావాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. ఇదే సమయంలో ఆయన తెలంగాణ రాజకీయాలపై కూడా స్పందించారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఆర్ఆర్’ ట్యాక్స్ పేరుతో రాష్ట్రాన్ని దోచుకుంటోందని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధిని కాంగ్రెస్ అడ్డుకుంటోందని ఆయన విమర్శించారు.

రవాణా సౌకర్యాల గురించి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 8 విమానాశ్రయాలు అందుబాటులో ఉన్నాయని, కానీ తెలంగాణలో మాత్రం కేవలం ఒక్క విమానాశ్రయం (హైదరాబాద్) మాత్రమే ఉండటం విచారకరమని అన్నారు. గత ప్రభుత్వాలు తెలంగాణలో మరిన్ని విమానాశ్రయాల ఏర్పాటును నిర్లక్ష్యం చేశాయని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పటికైనా తెలంగాణలో విమాన ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *