Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి ఒక బహిరంగ లేఖ రాశారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీకి ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్‌ను అందించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధిపై రేవంత్ రెడ్డికి ఉన్న విజన్‌ను సోనియా గాంధీ అభినందించారు. అయితే, ఈ అభినందనలపై కిషన్ రెడ్డి తన లేఖలో ఘాటైన ప్రశ్నలు సంధించారు. గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆయన విమర్శించారు.
లేఖలో ప్రధానంగా కిషన్ రెడ్డి 2023 ఎన్నికల ప్రచారాన్ని గుర్తు చేశారు. తుక్కుగూడ సభలో సోనియా గాంధీ స్వయంగా ప్రకటించిన ‘ఆరు గ్యారంటీలు’ ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా, ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తనను కలిసినప్పుడు ఈ హామీల అమలు గురించి సోనియా గాంధీ ఎప్పుడైనా అడిగి తెలుసుకున్నారా అని ఆయన నిలదీశారు. వాస్తవాలు తెలియకుండానే ముఖ్యమంత్రిని అభినందించడం సరికాదని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ప్రజలను మోసం చేయడానికే ఇప్పుడు కొత్తగా ‘విజన్ డాక్యుమెంట్’ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను మూసీ నదిలో కలిపేశారా లేక గాంధీ భవన్‌లో పాతిపెట్టారా అని ఎద్దేవా చేశారు. పాత హామీల ఊసే లేకుండా కొత్త ఆశలు చూపడం ప్రజలను వంచించడమేనని ఆయన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి పేరుతో ఒకరినొకరు అభినందించుకోవడం మానేసి, ముందుగా ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

