Kishan Reddy On Caste survey: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించినది కులగణన కాదని, అది కేవలం ఒక సర్వే మాత్రమేనని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వే పూర్తిగా అసంపూర్ణంగా, నిర్దిష్టత లేకుండా సాగింది. బీసీలకు న్యాయం చేయాల్సిన సమయంలో మత ప్రాతిపదికన ముస్లింలను బీసీ జాబితాలో చేర్చడం అన్యాయమైంది, అని ఆయన పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా, చట్టపరమైన ప్రక్రియలో భాగంగా దేశవ్యాప్తంగా కులగణన చేపట్టబోతుందని ఆయన తెలిపారు. “ప్రతి ఇంటికీ, ప్రతి వ్యక్తికీ వెళ్లి పారదర్శకంగా ఈ గణనను చేపడతాం. ఇది దేశంలోని అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేకూర్చేలా ఉండే విధంగా నిర్వహిస్తాం,” అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి: రోడ్లు – రైళ్లు – ఎక్స్‌ప్రెస్ వేలు
దేశ అభివృద్ధి వేగాన్ని పెంచేందుకు మౌలిక వసతుల విస్తరణకు కేంద్రం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధానంగా రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, టెలికమ్యూనికేషన్ రంగాల్లో విస్తృతంగా పనులు జరుగుతున్నాయని వివరించారు.
ఇది కూడా చదవండి: India-Pak: భారత్-పాక్ ఉద్రిక్తతలు..రష్యా తో విదేశాంగ మంత్రి జైశంకర్ చర్చలు
తెలంగాణలో భూసేకరణ సమస్యల వల్ల రైల్వే మరియు నేషనల్ హైవే పనులు ఆలస్యమవుతున్నాయని పేర్కొన్నారు. గతంలో కేసీఆర్‌కు, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి కూడా భూసేకరణను వేగవంతం చేయాలని అనేక లేఖలు రాశాను, అని గుర్తుచేశారు.
2014లో రాష్ట్రంలో 2,500 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండగా, ఇప్పుడు అవి 5,200 కి.మీ.కి పెరిగాయని వివరించారు. గత పదేళ్లలో రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.1,25,485 కోట్ల వ్యయం చేసినట్లు వెల్లడించారు.
నూతన ప్రాజెక్టులకు శంకుస్థాపన
రాష్ట్రంలో త్వరలో ప్రారంభం కానున్న పలు ప్రాజెక్టులకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపనలు చేయనున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఇందులో రూ.4,590 కోట్లతో 138 కిలోమీటర్ల మేర పనులు, రూ.826 కోట్ల విలువైన కొత్త ప్రాజెక్టులకు భూమి పూజలు నిర్వహించనున్నారు.

