Kishan Reddy: ఏబీవీపీ, బీజేవైయంలో క్రియాశీలక పాత్రను పోషించిన ముదుగంటి జితేందర్ రెడ్డిని 1987లో నక్సలైట్లు జగిత్యాలలో కాల్చిచంపేశారు. జితేందర్ రెడ్డి బయోపిక్ ను అతని సోదరుడు రవీందర్ రెడ్డి నిర్మించగా, ఈ నెల 8న అది విడుదలైంది. ఈ సినిమాను ఇటీవల కరీంనగర్ లో చూసిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చిత్రబృందాన్ని అభినందించగా, తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ లో ‘జితేందర్ రెడ్డి’ని చూశారు. ఈ సందర్భంగా జితేందర్ రెడ్డితో కలిసి బీజేవైయంలో తాను పనిచేసిన రోజుల్ని కిషన్ రెడ్డి తలుచుకున్నారు. తనకు ప్రాణహాని ఉందని తెలిసినా… నక్సలైట్లతో పోరాడిన గొప్ప యోధుడు జితేందర్ రెడ్డి అని అన్నారు. ఈ చిత్రబృందాన్ని, ముఖ్యంగా జితేందర్ రెడ్డి పాత్ర పోషించిన రాకేశ్ వర్రేను కిషన్ రెడ్డి అభినందించారు.
