Kishan reddy: దేశంలోని ఖనిజ వనరుల ప్రాసెసింగ్ రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల నేపథ్యంగా, ఢిల్లీలో “క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్ అవుట్‌రీచ్ ఫోరమ్” నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, “ఖనిజ రంగాన్ని పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. ముఖ్యంగా క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్‌ను ప్రోత్సహించడంపై ప్రత్యేక దృష్టి సారించాం” అని అన్నారు.
వేలానికి పారదర్శకత, అంతర్జాతీయ ఒప్పందాలు
“మినరల్ బ్లాకులను పారదర్శకంగా వేలం వేస్తున్నాం. ఇప్పటికే 34 మినరల్ బ్లాకులకు వేలం పూర్తి అయ్యింది” అని కిషన్‌రెడ్డి తెలిపారు. అంతేకాకుండా, “మూడు సంవత్సరాల్లో భారత భూగర్భ శాస్త్ర సంస్థ (GSI) మొత్తం 445 ప్రాజెక్టులను చేపట్టింది. అందులో 185 ప్రాజెక్టులకు నిధులు కేటాయించాం” అని చెప్పారు.
విదేశీ భాగస్వామ్యం
కృష్ణ మైనింగ్ రంగంలో భారత్‌కి కీలకంగా మారేలా ఆస్ట్రేలియా, అర్జెంటీనా, చిలీ దేశాలతో ఒప్పందాలు చేసుకున్నట్లు కిషన్‌రెడ్డి వెల్లడించారు. “విదేశాల్లోనూ మన ఖనిజ వ్యాపారాన్ని విస్తరించాల్సిన అవసరం ఉంది. సింగరేణి సంస్థ కూడా విదేశాల్లో ఖనిజ బ్లాకులను సొంతం చేసుకునే దిశగా ముందుకు సాగాలి” అని ఆయన సూచించారు.