Kishan Reddy: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో హుందాతనం, పరిణతి అవసరమని పేర్కొన్న ఆయన, మోదీపై వ్యక్తిగత దూషణలు చేయడం, అర్థంలేని ఆరోపణలు చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై దేశాభివృద్ధికి అహోరాత్రులు శ్రమిస్తున్న నాయకుడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు.
అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ గౌరవాన్ని పెంచుతూ దేశాన్ని ముందుకు నడిపిస్తున్న నాయకుడు మోదీ అని కిషన్ రెడ్డి కొనియాడారు. అలాంటి ప్రధానిపై కూనంనేని అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ దివాలాకోరుతనాన్ని బయటపెడుతున్నాయని విమర్శించారు.
ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, ఇలాంటి వ్యాఖ్యల వల్ల ప్రజాస్వామ్య విలువలపై, రాజకీయ వ్యవస్థపై ఏవగింపు కలుగుతుందని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కూనంనేని చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అంశంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జోక్యం చేసుకోవాలని కోరారు.
ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు పునరావృతం కాకుండా, సభా మర్యాదలు పాటించేలా చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కిషన్ రెడ్డి కోరారు. కాగా, శాసనసభలో మాట్లాడుతూ కూనంనేని సాంబశివరావు, “మోదీ మైండ్‌ను టెస్ట్ చేయించాలి” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.
