Kishan reddy: బీసీ హక్కుల కోసం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ నిర్వహించిన సభపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ సభ బీసీల సమస్యలను ప్రతిబింబించాల్సిన సమయంలో, గాంధీ కుటుంబాన్ని కొనియాడటమే ముఖ్యలక్ష్యంగా మారిందని ఆయన విమర్శించారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ, “రాష్ట్రంలో ఎదురవుతున్న రాజకీయ ఒత్తిడిని తట్టుకునేందుకు, గాంధీ కుటుంబ అనుగ్రహం కోసం రేవంత్ రెడ్డి ఈ సభను ఏర్పాటు చేశాడు. ఆయన 31 నిమిషాల ప్రసంగంలో సగానికి పైగా సోనియా, రాహుల్ పేర్లే జపించాడు,” అని ఎద్దేవా చేశారు.
బీసీలకు హామీలు మాత్రం.. అమలుకి నోచలేదని ఆగ్రహం
కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను 18 నెలలు గడిచినా అమలు చేయలేదని, బీసీల సంక్షేమానికి ఐదేళ్లలో లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. “రజకులు, గౌడ్లతో పాటు అనేక వర్గాలను మోసం చేశారు. బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయలేకపోయారు” అని ఆరోపించారు.
ముస్లింలను బీసీలుగా చూపే కుట్ర: కిషన్ రెడ్డి ఆరోపణ
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ కేటగిరీలో ముస్లింలు గెలిచిన ఉదాహరణను గుర్తు చేస్తూ, ఇప్పుడు బీసీలను తగ్గించి ముస్లింలకు లాభం కలిగించేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. “అశాస్త్రీయ సర్వేతో బీసీల జనాభా తగ్గించబడింది. 10 శాతం ముస్లింలను బీసీలుగా చూపి 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటే బీసీలకు నష్టం తప్పదు. ఇది స్పష్టంగా మోసమే” అని ఆయన అన్నారు.
నెహ్రూ కుటుంబంపై తీవ్ర విమర్శలు
బీసీ హక్కుల విషయంలో నెహ్రూ కుటుంబం చరిత్రంతా అన్యాయమేనని కిషన్ రెడ్డి ఆరోపించారు. “1955లో కాకా కాలేల్‌కర్ కమిషన్‌ను నెహ్రూ పక్కన పెట్టాడు. ఇందిరా, రాజీవ్ గాంధీలు మండల్ కమిషన్‌ను పట్టించుకోలేదు. ఇప్పుడు అదే వైఖరిని కాంగ్రెస్ కొనసాగిస్తోంది,” అని విమర్శించారు.
“మోదీపై విమర్శలు నిస్సారమైనవే”
“నరేంద్రమోదీ గారిని విమర్శించడం అంటే ఆకాశం మీద ఉమ్మేయడమే” అని ఘాటు వ్యాఖ్యలు చేసిన కిషన్ రెడ్డి, మోదీ నేతృత్వంలో దేశానికి సుస్థిరమైన పాలన అందుతోందని స్పష్టం చేశారు. “వచ్చే 30 ఏళ్లలో కాంగ్రెస్ కేంద్రంలో అధికారం లోకి వస్తుందన్న కలను వదిలేయాలి” అని చురకలంటించారు.