Kishan Reddy: కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి పత్తి రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పత్తి కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ఇందుకోసం తాను కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌ను కోరినట్లు తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పత్తిని చివరి కిలో వరకు కొనుగోలు చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
గతేడాది తెలంగాణలో సీసీఐ (CCI) ద్వారా సుమారు 80 శాతం పత్తి కొనుగోలు జరిగిందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. ఈసారి కూడా అదే విధంగా కొనుగోళ్లు సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఢిల్లీలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కిషన్ రెడ్డి, పత్తిలో తేమ శాతం తగ్గించి కొనుగోలు కేంద్రాలకు పంపడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. అలాగే, రైతులకు తేమ నియంత్రణపై అవగాహన కల్పించాలని సూచించారు.
ప్రతి సంవత్సరం పత్తి కొనుగోళ్ల సమయంలో కొన్ని సమస్యలు వస్తుంటాయని, వాటిని కేంద్రం ఎప్పటికప్పుడూ పరిష్కరించేందుకు కృషి చేస్తుందన్నారు. రైతులు ఒకేసారి పత్తిని మార్కెట్‌కి తీసుకురావడం వల్ల జిన్నింగ్ మిల్లులు ఇబ్బంది పడుతున్నాయని, అందుకే కొత్త యాప్ ప్రవేశపెట్టామని వివరించారు. ఈ యాప్ ద్వారా రైతులకు స్లాట్‌లు కేటాయించి, ఎవరు ఎప్పుడు పత్తి తెచ్చుకోవాలో సూచనలు ఇస్తామని తెలిపారు. దీని ద్వారా రైతులు, మిల్లర్లు ఇద్దరికీ సౌకర్యం కలుగుతుందని చెప్పారు.
దళారుల ప్రమేయం, అవినీతి తగ్గించేందుకు సీసీఐ నుంచి నేరుగా రైతుల ఖాతాల్లోనే చెల్లింపులు చేసే విధానం అమలు చేస్తున్నట్లు తెలిపారు.
అదే సమయంలో హైడెన్సిటీ కాటన్ ప్లాంటేషన్‌పై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, ఇది రైతుల ఆదాయాన్ని మూడింతలు పెంచగలదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో ఈ విధానం ఇంకా విస్తృతంగా అమలు చేయకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
చివరిగా, పత్తిలో తేమ శాతం 12 శాతం కంటే ఎక్కువగా ఉండకూడదని, ఆ ప్రమాణానికి అనుగుణంగా మాత్రమే కొనుగోళ్లు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.