Kishan Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఉత్కంఠ భరితంగా సాగుతున్న తరుణంలో, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి సర్వేలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రకారం, ఏ పార్టీ గెలుస్తుందనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత రాలేదని, సర్వేలలోనూ గందరగోళమే కనిపిస్తోందని అన్నారు.
సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్నదని అన్నారు. ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు తమ హామీలను విస్మరిస్తున్నారని విమర్శించారు. ఇచ్చిన గ్యారంటీలపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని, ప్రశ్నిస్తే ఉచిత బస్సు పథకాన్ని చూపించడం తప్ప మరేం చేయలేదని ఎద్దేవా చేశారు.
అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యంలో ఎక్కువ భాగం కేంద్ర నిధులతోనే అందిస్తున్నారని, అయినా దానిని ఆపేస్తామని సీఎం ఎలా అంటారని ప్రశ్నించారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెనుకబాటుకు గతంలో పాలించిన బీఆర్ఎస్ పార్టీ కూడా బాధ్యత వహించాలి అని ఆయన అన్నారు. జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉండటంతో కనీస సౌకర్యాలకూ నిధులు లేవని వ్యాఖ్యానించారు
ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్‌పై వ్యతిరేకత, బీఆర్ఎస్పై నమ్మకం లేకపోవడంతో ఓటర్లు ఎవరిని ఎంచుకోవాలో గందరగోళంలో ఉన్నారని, అదే పరిస్థితి సర్వేలలోనూ ప్రతిఫలిస్తోందని కిషన్ రెడ్డి విశ్లేషించారు.

