Kiran bedi: మెగాస్టార్ చిరంజీవి వారసత్వంపై చేసిన వ్యాఖ్యలు ఇటీవల వివాదాస్పదమయ్యాయి. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన బ్రహ్మా ఆనందం ప్రీ-రిలీజ్ వేడుకలో పాల్గొన్న చిరంజీవి, తన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తనకు మనవడు కావాలని అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, ఆయనకు ట్రోలింగ్ కూడా ఎదురైంది.
తాజాగా, ఈ అంశంపై మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా చిరంజీవికి సందేశం పంపిన ఆమె, “కూతుళ్లు కూడా వారసులే” అనే విషయాన్ని గుర్తించాలని సూచించారు.
“చిరంజీవి గారూ, కూతురు కూడా వారసురాలేనని నమ్మండి. అమ్మాయిలు ఏ విషయంలోనూ తక్కువ కాదు. ఇది పూర్తిగా మీరు ఆమెను ఎలా పెంచుతారు, ఆమె ఎదుగుదల ఎలా ఉంటుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. అమ్మాయిలను సమర్థంగా తీర్చిదిద్దిన తల్లిదండ్రుల నుంచి నేర్చుకోండి. వారు కుటుంబాలను గర్వపడేలా చేస్తారు. ఇప్పటికే చాలా మంది దీనిని నిరూపించారు.” అని కిరణ్ బేడీ పేర్కొన్నారు.ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గామారాయి.