Hyderabad: హైదరాబాద్ మహా నగరంలో చిన్నారుల కిడ్నాప్ ఘటనలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. ఇటీవల వరుస ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పిల్లల అపహరణ కోసం కిడ్నాపర్లు కాచుకొని కూర్చున్నారనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఎక్కడ పడితే అక్కడ కిడ్నాపర్లు దాక్కొని ఉంటున్న ఘటనలు ఒక్కొక్కటీ వెలుగు చూస్తుండటంతో నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ఉప్పల్ పరిధిలో జరిగిన ఘటనను మరువక ముందే రాజేంద్రనగర్‌లో మరొకటి వెలుగు చూడటం అలజడి రేకెత్తిస్తున్నది.
Hyderabad: రాజేంద్రనగర్ పరిధిలోని హైదర్‌గూడలో ఆడుకుంటున్న ఓ చిన్నారి వద్దకు ఓ దుండగుడు చేరాడు. చిన్నారి సైకిల్‌పై ఆడుకుంటుండగా, ఆ చిన్నారి వద్దకు చేరాడు. ఏకంగా పిల్లల సైకిల్ ఎక్కి కూర్చున్నాడు. ఆ చిన్నారిని మాటల్లో పెట్టి దూరంగా తీసుకెళ్తుండగా, ఈ విషయాన్ని స్థానికులు గమనించారు. ఆ కిడ్నాపర్‌ను పట్టుకొని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టి, చిన్నారిని తల్లిదండ్రుల చెంతకు క్షేమంగా చేర్చారు.
Hyderabad: ఇలాంటి ఘటనలే నగరంలో పలుచోట్ల చోటుచేసుకుంటున్నాయి. కిడ్నాపర్లు ఎక్కడో ఉండటం లేదు. ఇండ్ల చెంతకే చేరి, స్థానికులుగా బిల్డప్ ఇచ్చి, ఇట్టే కిడ్నాప్ చేసేందుకు యత్నిస్తున్నారు. కొన్ని ఘటనల్లో దుండగులు దొరుకుతుండగా, పలు ఘటనల్లో చిన్నారులను రాష్ట్రాలకు రాష్ట్రాలనే దాటిస్తున్నారు. ఈ ఆందోళనకర విషయంలో పోలీసుల రక్షణ చర్యలతో పాటు తల్లిదండ్రులు కూడా తగు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Hyderabad: అంతర్రాష్ట్ర ముఠాలు కూడా పిల్లల కిడ్నాప్‌నకు యత్నిస్తున్నాయని వార్తలొస్తున్నాయి. ఆ ముఠాల పనిపట్టేందుకు పోలీసులు తగు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. పిల్లలు ఆడుకునే సమయంలో, స్కూళ్లకు వెళ్లి వచ్చే వేళల్లో తల్లిదండ్రులు తప్పక ఉండాలని నిపుణులు పేర్కొంటున్నారు.