Kichcha Sudeep: కర్ణాటక ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ నటుడు అవార్డును ప్రముఖ నటుడు కిచ్చా సుదీప్ సున్నితంగా తిరస్కరించాడు. అవార్డులు అనేవి నటీనటులు, సాంకేతిక నిపుణుల ప్రతిభకు తార్కాణాలు. ప్రభుత్వం నుండి వచ్చే అవార్డులను ప్రతి ఒక్కరు తమకు లభించిన గౌరవంగా భావిస్తారు. తాజాగా కర్ణాటక ప్రభుత్వం 2019 స్టేట్ అవార్డ్స్ ను ప్రకటించింది. అందులో పెహల్వాన్ చిత్రానికి గానూ సుదీప్ ను ఉత్తమ నటుడిగా ఎంపిక చేసింది. కానీ ఆయన దానిని తిరస్కరించారు. కొంతకాలంగా తాను అవార్డులను స్వీకరించడం లేదని, దీనిని అర్హులైన వేరే ఎవరికైనా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నిర్ణయం ప్రభుత్వాన్ని, జ్యూరీ మెంబర్స్ ను కించపరచినట్టుగా అర్థం చేసుకోవద్దని ఆయన అభ్యర్థించారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో సుదీప్ బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి బొమ్మైను సపోర్ట్ చేశారు. కానీ ఆయన పార్టీ ఆ ఎన్నికల్లో ఓడిపోయింది. బహుశా కారణంగానూ సుదీప్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఈ అవార్డును తిరస్కరించి ఉండొచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.
