Khushboo: హ్యాక్ అయిన కుష్బూ అకౌంట్

Khushboo: ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు కుష్బూ సుందర్ సోషల్ మీడియా ఖాతా హ్యాకింగ్ ఘటనతో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తన ట్విట్టర్ (ప్రస్తుతం ఎక్స్‌గా మారిన) ఖాతా హ్యాకింగ్‌కు గురైందని, దానిని తిరిగి పొందేందుకు సహాయం చేయాలని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు, అనుచరులకు అత్యవసరంగా విజ్ఞప్తి చేశారు.

ఈ సంఘటనతో ఆమె అభిమానులు, ఫాలోవర్లలో ఆందోళన ఏర్పడింది. ప్రస్తుతానికి ఖుష్బూ ట్విట్టర్ ఖాతాలో విదేశీ భాషలో పలువురు నకిలీ ట్వీట్లు కనిపిస్తున్నాయి.

ఈ విషయాన్ని వెల్లడిస్తూ కుష్బూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సందేశాన్ని పోస్టు చేశారు. ‘‘నా ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయ్యింది. దాన్ని ఎలా తిరిగి పొందాలో ఎవరికైనా తెలిస్తే దయచేసి చెప్పండి. ఇది అత్యవసరంగా చేయాల్సిన పని,’’ అని ఆమె పేర్కొన్నారు. గత తొమ్మిది గంటలుగా తన ఖాతాలోకి లాగిన్ కావడానికి ప్రయత్నిస్తున్నానని, కానీ ఫలితం లేకపోయిందని చెప్పారు.

‘‘నా ఐడీ, పాస్‌వర్డ్ పనిచేయడంలేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా లాగిన్ కావడం సాధ్యపడడం లేదు. ఖాతాలోకి ప్రవేశించలేక పోవడం వల్ల నేను ఎలాంటి పోస్టులు పెట్టలేకపోతున్నాను, అప్‌డేట్ చేయడం కూడా వీలుకావడం లేదు,’’ అని ఆమె వివరించారు.

తన ఖాతాను తిరిగి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నానని తెలిపారు. అయితే తన ఖాతా నుంచి ఎవరైనా అనుమానాస్పద పోస్టులు గమనిస్తే, దయచేసి తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ‘‘ఇంతవరకూ నేను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికలో అందుబాటులో ఉంటాను’’ అని వెల్లడించారు.

ఆమె ఈ పోస్టు చేసిన కొద్దిసేపటికే అది వైరల్‌గా మారింది. అనేకమంది అభిమానులు, అనుచరులు ఆమెకు మద్దతు తెలుపుతూ, ఖాతా తిరిగి పొందేందుకు పలు సూచనలు చేస్తున్నారు.

ఇలాంటి ఘటనలు ఇటీవలే మరోసారి చోటు చేసుకున్నాయి. కొద్ది రోజుల క్రితమే నటి త్రిష ట్విట్టర్ ఖాతా కూడా హ్యాకింగ్‌కు గురైంది. ఆ సమయంలో క్రిప్టోకరెన్సీకి సంబంధించిన నకిలీ ప్రచార పోస్టులు ఆమె ఖాతా నుంచి ప్రచురించబడ్డాయి. ఇప్పుడు ఖుష్బూ ఖాతా కూడా హ్యాకర్ల చేతికి చిక్కడంతో, ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాల భద్రతపై మరోసారి సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రస్తుతం ఖుష్బూ తన ఖాతాను తిరిగి పొందే పనిలో నిమగ్నమై ఉన్నారు. అప్పటి వరకూ ఆమె ట్విట్టర్ ఖాతా నుంచి వచ్చే ఏ అనుమానాస్పద ట్వీట్లనైనా జాగ్రత్తగా పరిశీలించాలని అభిమానులకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *