Kharge: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ గీతం ఆలపించిన ఘటనపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఈ విషయం ఇక ముగిసిన అధ్యాయమని, దీన్ని పెద్దది చేయాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
బుధవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడిన ఖర్గే, “శివకుమార్ అలా చేయకూడదు, కానీ చేశారు. ఆ తర్వాత క్షమాపణ చెప్పారు. కాబట్టి, దీనిపై నేను మళ్లీ స్పందించను. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు ఎవరూ చేయకూడదు” అని అన్నారు.
ఏమి జరిగింది?
ఇటీవల ముగిసిన కర్ణాటక అసెంబ్లీ సమావేశాల సందర్భంగా, ప్రతిపక్ష నేత ఆర్. అశోక్‌ను ఆటపట్టించడానికే తాను ఆర్ఎస్ఎస్ గీతంలోని కొన్ని పంక్తులు పాడానని శివకుమార్ వివరణ ఇచ్చారు. అయితే, ఈ చర్య తీవ్ర విమర్శలకు దారితీయడంతో, ఆయన వెనక్కి తగ్గారు.
మంగళవారం మీడియాతో మాట్లాడిన శివకుమార్, “నా చర్య వల్ల పార్టీ సహచరులు లేదా ఇండియా కూటమి మిత్రులు బాధపడి ఉంటే క్షమించమని కోరుతున్నాను. నేను జీవితాంతం కాంగ్రెస్ వాదినే. గాంధీ కుటుంబం పట్ల నా విధేయత దేవుడిపై భక్తుడికి ఉండేంత గాఢంగా ఉంటుంది” అని స్పష్టం చేశారు.
బీజేపీ తీవ్ర విమర్శలు
ఆర్ఎస్ఎస్ గీతం పాడినందుకు శివకుమార్ క్షమాపణ చెప్పడంపై బీజేపీ ఘాటుగా విమర్శించింది. ప్రతిపక్ష నేత ఆర్. అశోక్ మాట్లాడుతూ,”భారతమాతను కీర్తించే ‘నమస్తే సదా వత్సలే మాతృభూమే’ గీతం పాడినందుకు క్షమాపణ చెప్పాల్సి వస్తే, కాంగ్రెస్ పార్టీ ప్రకారం భారతీయులు ఎవరిని కీర్తించాలి? ఇటలీ నుంచి వచ్చిన మహిళనా?” అని ఎద్దేవా చేశారు.ఈ వివాదంతో కర్ణాటక రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.

