Khairtabad Ganesh: హైదరాబాద్ మహానగరం గణేష్ నవరాత్రి ఉత్సవాల కోసం రంగు సిద్ధమైంది. గణేష్ నవరాత్రులు అనగానే భక్తులకు గుర్తుకువచ్చే పేరు ఖైరతాబాద్ బడా గణేష్. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా వేలాది మంది భక్తులు మహా గణపతిని దర్శించుకునేందుకు తరలివచ్చే అవకాశం ఉంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఈ ఏడాది ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ప్రత్యేకత
2025 సంవత్సరానికి గాను 69 అడుగుల ఎత్తులో నిర్మించిన మహా గణపతి విగ్రహం “శ్రీ విశ్వ శాంతి మహాశక్తి గణపతి”గా భక్తులకు దర్శనమివ్వనుంది.
-
విగ్రహం 3 తలలతో, 8 చేతులతో నిలబడి ఉన్న భంగిమలో అలరించనుంది.
-
కుడి వైపు చేతుల్లో సుదర్శన చక్రం, ఆయుధం, అభయహస్తం, రుద్రాక్షమాల ఉంటాయి.
-
విగ్రహానికి ఇరువైపులా శ్రీ జగన్నాథ స్వామి, శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, లలిత త్రిపుర సుందరి, గజ్జలమ్మ దేవి విగ్రహాలు ఏర్పాటు చేశారు.
-
విగ్రహానికి చివరి దశలో జరిగిన కన్నుదిద్దే కార్యక్రమాన్ని శిల్పి రాజేందర్ పూర్తి చేశారు.
ట్రాఫిక్ ఆంక్షలు – ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు
భక్తుల రద్దీని నియంత్రించడానికి పోలీసులు ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. రద్దీ ఆధారంగా ఉదయం 11 గంటల నుంచి అర్ధరాత్రి వరకు వాహనాల మళ్లింపులు ఉంటాయి.
మళ్లింపులు ఈ విధంగా ఉంటాయి:
-
వీవీ స్టాచ్యూ నుంచి మింట్ కాంపౌండ్ వైపు వెళ్లే వాహనాలను నిరంకారీ జంక్షన్ వైపు మళ్లిస్తారు.
-
ఓల్డ్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి బడా గణేష్ వైపు వచ్చే వాహనాలను ఇక్బాల్ మీనార్ వైపు తిప్పుతారు.
-
ఇక్బాల్ మీనార్ నుంచి ఐమాక్స్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను తెలుగుతల్లి జంక్షన్ వైపు మళ్లిస్తారు.
-
నెక్లెస్ రోడ్ రోటరీ నుంచి మింట్ కాంపౌండ్ వైపు వచ్చే వాహనాలను తెలుగుతల్లి జంక్షన్ లేదా ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు పంపిస్తారు.
-
నిరంకారీ నుంచి ఖైరతాబాద్ పోస్టాఫీస్ మీదుగా రైల్వే గేట్ వైపు వచ్చే వాహనాలను ఓల్డ్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్ జంక్షన్ వైపు మళ్లిస్తారు.
ఇది కూడా చదవండి: Vinayaka Chavithi 2025: వినాయక చవితి రోజున పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి
పార్కింగ్ సదుపాయాలు
భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశారు.
-
నెక్లెస్ రోడ్ – ఎన్టీఆర్ గార్డెన్ వైపు నుంచి వచ్చే వారు తమ వాహనాలను రేస్ రోడ్, ఎన్టీఆర్ ఘాట్, ఐమాక్స్ హెచ్ఎండీఏ పార్కింగ్, ఐమాక్స్ ఎదురు ప్రాంగణం, సరస్వతి విద్యా మందిర్ హైస్కూల్ వద్ద పార్క్ చేసుకోవచ్చు.
-
ఖైరతాబాద్ జంక్షన్ వైపు నుంచి వచ్చే వారు విశ్వేశ్వరయ్య భవన్ వద్ద వాహనాలను పార్క్ చేయాలి.
పోలీసులు సూచనలు
-
భక్తులు వీలైనంత వరకు మెట్రో, ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్ వంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు.
-
ఎలాంటి ట్రావెల్ సహాయం కోసం భక్తులు హెల్ప్‌లైన్ నంబర్ 9010203626కు కాల్ చేయవచ్చు.
ఉత్సవాల వైభవం
11 రోజులపాటు జరిగే ఖైరతాబాద్ గణేష్ నవరాత్రులు హైదరాబాద్‌కు ప్రత్యేక శోభను తెస్తాయి. ప్రతి రోజు జరిగే పూజలు, మొక్కులు, భక్తుల రద్దీ ఒక పండుగ వాతావరణాన్ని కల్పిస్తాయి. ఈ ఏడాది ప్రత్యేకమైన “శ్రీ విశ్వ శాంతి మహాశక్తి గణపతి” విగ్రహం దర్శనార్థం మరింత ఎక్కువ మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.