Khairatabad Ganesh: తెలంగాణలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తుల కోలాహలం, జయజయధ్వానాల మధ్య గణనాథుడు గంగమ్మ ఒడికి చేరారు. వినాయక చవితి ఉత్సవాలకు ఘనంగా ముగింపు పలికారు.
ఈ ఏడాది వినాయక చవితి సందర్భంగా ప్రతిష్టించిన ఈ భారీ విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు ఉదయం శోభాయాత్ర ప్రారంభమైంది.ఖైరతాబాద్ నుంచి ప్రారంభమైన ఈ శోభాయాత్ర, రాజ్‌దూత్ సర్కిల్, టెలిఫోన్ భవన్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్‌లో ఉన్న ట్యాంక్‌బండ్‌కు చేరుకుంది. భక్తులు డప్పు వాయిద్యాలు, నృత్యాలతో ఈ యాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నంబర్ 4 వద్ద నిమజ్జన ప్రక్రియ జరిగింది. ముందుగా ఉత్సవ సమితి సభ్యులు, పూజారులు వినాయకుడికి చివరి పూజలు నిర్వహించారు. ఆ తర్వాత క్రేన్ సహాయంతో గణనాథుడిని హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేశారు. భక్తులు ‘బై బై గణేశా’ అంటూ గణనాథుడికి వీడ్కోలు పలికారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు శోభాయాత్ర మార్గంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read: KCR: కేసీఆర్‌ను కలవనున్న హరీశ్‌రావు.. కాసేపట్లో ఎర్రవల్లిలో కీలక సమావేశం
గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు
గణేష్ నిమజ్జన సందర్భంగా హైదరాబాద్ నగరమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఖైరతాబాద్ గణేషుడితో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి చిన్న, పెద్ద గణపతులు కూడా హుస్సేన్ సాగర్ వైపు తరలివచ్చాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ మళ్లింపులు, అదనపు భద్రతా సిబ్బందిని నియమించి నిమజ్జనోత్సవాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.