Tomato Prices: దాయాది దేశం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభం, ప్రకృతి వైపరీత్యాలు, సరిహద్దు ఘర్షణలతో పాటుగా.. నిత్యావసరాల ధరల పెంపుతో అల్లాడిపోతోంది. ముఖ్యంగా కూరల్లో తప్పనిసరిగా వాడే టమాటా ధర పాకిస్తాన్‌లో ఒక్కసారిగా కొండెక్కి కూర్చుంది. కిలో టమాటా ధర ఏకంగా రూ.700 పలకడంతో, జనాలు టమాటా కొందామనే ఆలోచనకే వణికిపోతున్నారు.
ప్రస్తుతం పాకిస్తాన్ ఎదుర్కొంటున్న ఈ దారుణ పరిస్థితులను చూసి, విశ్లేషకులు ఇది దేశం ‘చేజేతులా చేసిన పాపాల’కు కర్మఫలం అని వ్యాఖ్యానిస్తున్నారు. ఉగ్రవాదాన్ని ప్రపంచంపైకి ఎగదోసి వినాశనానికి కారణమైన ఈ దేశం ఇప్పుడు నిత్యావసరాల కోసం అవస్థలు పడుతుండడం గమనార్హం.
ఇది కూడా చదవండి: Sitanshu Kotak: రోహిత్, కోహ్లీ ఫామ్‌పై బ్యాటింగ్ కోచ్ కీలక కామెంట్స్
కొండెక్కుతున్న ధరలకు కారణాలివే:
పాకిస్తాన్‌లో టమాటా ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకోవడానికి అనేక కారణాలు ఏకకాలంలో దోహదపడ్డాయి:
- భారీ వరదలు, పంట నష్టం: ఈ మధ్య కాలంలో సింధ్, బలూచిస్థాన్, దక్షిణ పంజాబ్ వంటి ప్రాంతాల్లో కురిసిన కుండపోత వానలు, వరదలు వేలాది ఎకరాల్లో ఉన్న టమాటా పంటను పూర్తిగా నాశనం చేశాయి. దీంతో దేశంలో టమాటా సరఫరా భారీగా తగ్గిపోయింది. సాధారణంగా రెండు ప్రధాన పంటల సీజన్‌ల మధ్య కొరత ఏర్పడటం సహజమే అయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు దీన్ని మరింత తీవ్రతరం చేశాయి.
- రవాణా అంతరాయాలు: భారీ వర్షాలు, వాతావరణ మార్పుల వల్ల పాక్‌లోని పలు ప్రాంతాల్లో రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. దీంతో రవాణా ఆలస్యం కావడం వల్ల కూడా పంట సరైన సమయానికి మార్కెట్లకు చేరక ధరలు భారీగా పెరిగాయి.
- పాకిస్తాన్ రూపాయి పతనం: భారత రూపాయి విలువతో పోలిస్తే పాకిస్తాన్ రూపాయి విలువ కేవలం 0.31 పైసలుగా ఉండటం పరిస్థితిని మరింత దారుణంగా మార్చింది. విదేశీ కరెన్సీలతో పోలిస్తే దీని విలువ దారుణంగా పడిపోవడంతో, దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయి.
- ఆఫ్ఘన్‌పై నిషేధం (స్వయం కృత అపరాధం): పంట నష్టం కారణంగా పాకిస్తాన్ ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల నుంచి టమాటా దిగుమతులపై ఆధారపడాల్సి వచ్చింది. అయితే, ఆఫ్ఘనిస్థాన్ నుంచి టమాటా సరఫరాపై పాకిస్తానే నిషేధం విధించింది. ఈ నిర్ణయం దేశీయ మార్కెట్‌లో కొరతను మరింత పెంచింది.
- రైతుల నిరాసక్తి: గతంలో టమాటా సాగు చేసిన రైతులకు మద్దతు ధర లభించకపోవడం, వాతావరణ మార్పుల వల్ల తరచుగా నష్టాలు రావడంతో… ఈ సంవత్సరం రైతులు టమాటా సాగు వైపు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇది కూడా ధర పెరగడానికి ఒక కారణమైంది.
ఇది కూడా చదవండి: RT76: ఆషికా అప్డేట్ వైరల్!
ఆందోళన కలిగిస్తున్న రిటైల్ ధరలు:
ప్రస్తుతం లాహోర్, కరాచీ వంటి ప్రధాన నగరాల్లో టమాటా ధర రూ.700కి అమ్ముడవుతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఫైసలాబాద్‌లో రూ.500, ముల్తాన్‌లో రూ.450, లాహోర్‌లో రూ.400 పలుకుతుండగా.. పంజాబ్‌లోని జీలంలో అత్యధికంగా రూ.700కి చేరింది.
వాస్తవానికి, దేశంలో ప్రభుత్వ అధికారిక ధరల జాబితా ప్రకారం కిలోకు గరిష్ట ధర రూ.170గా నిర్ణయించినప్పటికీ, ఈ ధర ఎక్కడా అమలు కావడం లేదని పాకిస్తానీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు వ్యాపారులు ఈ కొరతను ఆసరాగా చేసుకుని కృత్రిమ కొరత సృష్టించి ధరలను ఒక్కసారిగా పెంచుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
మొత్తం మీద, ప్రకృతి వైపరీత్యాలు, ఆర్థిక సంక్షోభంతో పాటుగా.. టమాటాలపై తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు పాకిస్తాన్‌ను మరింత సంక్షోభంలోకి నెట్టేశాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.