Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితులుగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ లను భారత్ కు రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇంటర్ పోల్ ద్వారా వీరిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడం ద్వారా న్యాయపరమైన ప్రక్రియ మరింత ముందుకు సాగింది.
సీబీఐ నుంచి వచ్చిన తాజా సమాచారం మేరకు, తెలంగాణ సీఐడీ, కేంద్ర హోం శాఖ, విదేశీ వ్యవహారాల శాఖల సమన్వయంతో వీరిని వీలైనంత త్వరగా భారత్ కు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా, అమెరికాలో ఉన్న డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ (DHS)కి వీరిపై సమాచారాన్ని అందజేశారు. దీంతో అక్కడి అధికారులు ప్రొవిజనల్ అరెస్ట్ చేసే అవకాశముంది. డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా వీరిని భారత్‌కు తరలించే మార్గాన్ని పరిశీలిస్తున్నారు.
ఇది కూడా చదవండి: YSR Kadapa District: చరిత్రనే చెరిపేయాలని చూసిన వైసీపీ..!
ఇక, గత ఏడాది మార్చి 10న పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన వెంటనే ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ విదేశాలకు పారిపోయారు. ఈ కేసులో కీలక ఆధారాలు బహిర్గతం కావాలంటే నిందితులను విచారించాల్సిన అవసరం ఉందని పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో, ఇటీవల కోర్టు వారు ఎప్పుడు అరెస్టవుతారనే విషయంపై అధికారులను ప్రశ్నించడంతో, అందుబాటులో ఉన్న అన్ని మార్గాలపై పోలీసులు దృష్టి కేంద్రీకరించారు.
ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ అరెస్ట్ కోసం ఎప్పుడు చర్యలు పూర్తి అవుతాయనేది చూడాల్సి ఉంది. ఈ కేసు విచారణలో కొత్త మలుపులు ఎప్పుడైనా రావొచ్చు.
