AP Fake Liquor Case: అన్నమయ్య జిల్లాలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మొలకలచెరువు నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో పట్టుబడిన 10 మంది నిందితులను మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ తంబళ్లపల్లె కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
ఎక్సైజ్ శాఖ విజ్ఞప్తి..
ఈ కేసు దర్యాప్తులో భాగంగా.. 10 మంది నిందితులను ఏడు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఎక్సైజ్ శాఖ తంబళ్లపల్లె కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఏడు రోజులు కాకుండా, మూడు రోజుల కస్టడీకి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో, ఎక్సైజ్ శాఖ అధికారులు రేపు (గురువారం) ఉదయం నుంచి నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టనున్నారు. ఈ విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
మరో ముగ్గురి అరెస్ట్!
ఇదిలా ఉండగా, నకిలీ మద్యం తయారీకి సహకరించిన మరో ముగ్గురిని ఎక్సైజ్ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రమేష్, అల్లా భక్షు, శ్రీకర్ అనే ఈ ముగ్గురిని విజయవాడలో విచారిస్తున్నారు. వీరు నకిలీ మద్యం తయారీకి పూర్తిగా సహకరించారని ఎక్సైజ్ శాఖ గుర్తించింది. ఈ ముగ్గురిని కూడా రేపు అరెస్ట్ చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రధాన నిందితుడిపై పీటీ వారెంట్!
నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జనార్థన్ రావు అరెస్టును చూపించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఎక్సైజ్ పోలీసులు తంబళ్లపల్లె కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.
ఆ ముగ్గురి ఆచూకీ గల్లంతు..
మరోవైపు, ఈ కేసులో కీలకంగా ఉన్న A5 జయచంద్రారెడ్డి పీఏ రాజేష్, A.17 జయ చంద్రారెడ్డి, A.18 గిరిధర్ రెడ్డి ఆచూకీ మాత్రం ఇప్పటివరకు లభించలేదు. వారి కోసం ఎక్సైజ్ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. నకిలీ మద్యం కేసులో రోజుకో కొత్త మలుపు తిరుగుతుండటం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.